టీడీపీలోకి కృష్ణ తమ్ముడు…ఎప్పుడంటే ?

సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబుతో అమరావతిలో భేటీ అయ్యారు. ఇటీవల ఆదిశేషగిరిరావు వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపధ్యంలో ఆయన సీఎంతో భేటీ కావడం ఇప్పుడు ఆ వ్యాఖ్యలకి ఊతం ఇస్తోంది. సీఎంతో భేటీ తర్వాత అయన టీడీపీలో చేరే తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్టమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన అనుకొన్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్‌ ఆయనను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీంతో అలక పాన్పు ఎక్కినా ఆదిశేషగిరిరావు వైసీపీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసినట్టు సమాచారం. చంద్రబాబుకు ఆదిశేషగిరిరావు దగ్గర బంధువు. ఇప్ప‌టికే త‌న సోద‌రుడు కృష్ణ అల్లుడు గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీ నుండి గుంటూరు ఎంపీగా ఉన్నారు.

టీడీపీలోకి కృష్ణ తమ్ముడు...ఎప్పుడంటే ? - Telugu Bullet

జ‌య‌దేవ్ త‌ల్లి అరుణ కుమారి టీడీపీలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఆది శేష‌గిరిరావు సైతం టీడీపీలో చేరతారని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. వైసీపీ విధివిధానాలు నచ్చక పోవడం వల్లే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు ఆదిశేషగిరిరావు అన్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి చర్చించిన తరువాత పార్టీలో చేరే తేదిని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఆయన అన్నారు. టీడీపీ – వైసీపీల మధ్యే ఎన్నికలు జరుగుతాయన్న ఆయన చంద్రబాబు మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు. అన్ని అంశాలపై తమ బంధువులు, కార్యకర్తలతో చర్చిస్తానని, త్వరలో తన రాజకీయ భవిష్యత్‌పై ప్రకటన చేస్తానని ఆదిశేషగిరిరావు పేర్కొన్నారు.