భర్త చనిపోయి ఒంటరిగా జీవిస్తున్న మహిళతో సహజీవనం చేస్తున్న యువకుడు ఆమె వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. శంకరంపేట మండలం శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది.
ఆమెకు చైతన్యనగర్ కాలనీలో నివాసముండే లింగం అనే యువకుడితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. అవివాహితుడైన లింగం ఆ మహిళ మోజులో పడి కుటుంబాన్ని కూడా పట్టించుకోవడం మానేశాడు. దీంతో అతడి తల్లిదండ్రులు తమ కుమారుడిని వదిలేయాలని మహిళకు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే లింగం బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పటాన్‌చెరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు చొక్కా జేబులో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి ఆత్మహత్యకు సదరు మహిళే కారణమని నిర్ధారించారు. ‘తాను సహజీవనం చేస్తున్న మహిళ రూ.60వేలు ఇవ్వాలని వేధిస్తోందని, ఇవ్వకపోతే తమ బంధం గురించి అందరికీ చెబుతానని బెదిరించిందని, దిక్కుతోచని పరిస్థితిలోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని లింగం లేఖలో పేర్కొన్నాడు.