పెళ్లయినా ప్రియురాలితో ఇంకా అఫైర్…యువకుడి దారుణహత్య

affair with lover after marriage

ముస్లిం మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడు దారుణహత్యకు గురైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటు చేసుకుంది. వేములవాడలోని సుబ్రమణ్యనగర్‌కు చెందిన నాగుల రవి(30) పదేళ్ల క్రితం ఓ ముస్లిం యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలోనే 2009లో ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. కొంతకాలం తర్వాత ఇంటికి తిరిగొచ్చారు. ఈ పంచాయతీ పోలీస్‌స్టేషన్‌కు చేరగా ఇరు కుటుంబాలు సయోధ్య కుదుర్చుకున్నాయి. కొద్దిరోజులకు ఆ యువతికి తల్లిదండ్రులు మరొక వ్యక్తితో పెళ్లి జరిపించారు. ఆమె భర్త ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటున్నాడు. దీంతో ఆమె గతేడాది రవి ఇంటి సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకుంది. భర్త అడ్డు లేకపోవడంతో ఆ మహిళ రవితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రవికి ఇంకా పెళ్లి కాకపోవడంతో వారి బంధానికి అడ్డు చెప్పేవారే లేకపోయారు. ఈ వ్యవహారం ఆ మహిళ తరఫు వారికి తెలియడంతో రవిని హత్య చేయాలని నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం పనికి వెళ్లిన రవి మధ్యాహ్న సమయంలో భోజనం చేసేందుకు ఇంటికి వస్తుండగా ముగ్గురు యువకులు అతడిపై వేట కొడవళ్లతో విచక్షణా రహితంగా నరికారు. రవి కేకలు విన్న ఆమె తల్లి బయటకు వచ్చి తన కొడుకును చంపొద్దని వేడుకున్నా వారు కనికరించలేదు. తీవ్ర రక్తస్రావమైన రవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రవిని నరుకుతున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసుల వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.