వక్రబుద్ధిని ప్రదర్శించిన క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది

వక్రబుద్ధిని ప్రదర్శించిన క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది

ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా మహమ్మారిపై పోరు చేస్తుంటే పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. ఇప్పటికే అనేకసార్లు భారత్‌పై విషంకక్కిన పాకిస్తానీ.. మరోసారి నోరుపారేసుకున్నాడు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు అన్యాయంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గతంలో అఫ్రిది తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి భారతీయుల ఆగ్రహానికి గురయ్యాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల ప్రజలకు తన ట్రస్ట్‌ ద్వారా సహాయం చేసేందుకు అఫ్రిది ఆదివారం పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో పర్యటించాడు.

ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన షాహిద్‌ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘పాకిస్తాన్‌ మొత్తం సైన్యం ఏడు లక్షలు మాత్రమే. భారత ప్రభుత్వం ఒక్క కశ్మీర్‌లోనే ఏడు లక్షలకుపైగా తన సైన్యాన్ని మోహరించింది. అయినా కశ్మీరీ పౌరులకు పాక్‌ సైన్యానికే మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచమంతా కరోనా వ్యాధిపై పెద్ద పోరాటమే చేస్తోంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మనస్సులో కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి ఉంది’ అని వివాదాదస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్రిది చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా పాక్‌ ఆటగాడు చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెటర్లు తమదైన శైలీలో కౌంటర్లు ఇస్తున్నారు. జాతియవాదంలో ఎప్పుడూ ముందుండే మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ట్విటర్‌ వేదికగా అఫ్రిదిపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘కశ్మీర్‌లో భారత ప్రభుత్వం ఏడు లక్షల సైన్యాన్ని మోహరించిందని ఓ 16 ఏళ్లు వృద్ధుడు విషయం కక్కుతున్నాడు. భారత్‌ సొంతమైన కశ్మీర్‌ కోసం 70 ఏళ్లుగా భిక్షాటన చేస్తూనే ఉన్నారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, ఆర్మీ చీఫ్‌ బజ్వా, అఫ్రిది లాంటి వ్యక్తులు కుట్ర పన్నుతున్నారు. ఏం చేసినా కశ్మీర్‌ ఎప్పిటికీ భారతతీయుల సొంతమే’ అంటు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఇక అఫ్రిది వ్యాఖ్యలను యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, శిఖర్‌ ధావన్‌, హర్బజన్‌ సింగ్‌ లాంటి ఆటగాళ్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాక సోషల్‌ మీడియాలో సైతం అఫ్రిది వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి.