మనం ఏ వ్యాక్సిన్ తీసుకున్నా అది ఏ మేరకు పని చేస్తుందనే విషయం మన శరీరంలోని రోగ నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పటిష్టింగా ఉంటే ఎటువంటి వ్యాక్సిన్ అయినా తన పని అతిత్వరగా, సమర్థవంతంగా పూర్తి చేస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అందుకే శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచేందుకు మనం ఏం చేయాలో వైద్యులు సూచిస్తున్నారు. వీటిని పాటిస్తే మనం తీసుకోబోయే కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందని చెబుతున్నారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి కొన్ని రోజులు ముందు నుంచే మద్యం మానేయాలి. వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కొన్ని రోజులు మద్యం జోలికి వెళ్లకూడదు. కాలేయంపై ఆల్కహాల్ తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. దీంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. నిత్యం ఆల్కహాల్ తీసుకునే వారిలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుందని, శరీరంలో ఎటువంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా వాటిని నిరోధించడంలో విఫలమవుతుందని కొన్ని పరిశోధనల ద్వారా బయటపడిందని వైద్యులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి కొన్ని రోజుల ముందు నుంచి.. తీసుకున్నాక కొన్ని రోజుల వరకు మద్యంతోపాటు సిగరెట్ కూడా మానేస్తే మంచిదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
మానసిక ఒత్తిడి స్థాయి విపరీతంగా పెరిగినా, దీర్ఘకాలంగా ఉన్నా కార్టిసాల్ లెవెల్స్ విపరీతమైన హెచ్చుతగ్గులకు గురవుతాయని వైద్యులు చెబుతున్నారు. శరీరంలోని తెల్ల రక్త కణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ తెల్ల రక్త కణాలు తగ్గిపోతే మన శరీరం త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుందట. మనం ఎంత ఎక్కువ ఒత్తిడితో ఉంటే అంత త్వరగా జబ్బుపడడం ఖాయం. అంటే.. మన రోగ నిరోధక శక్తి రోజురోజుకూ తగ్గిపోతున్నట్టే లెక్క. అందుకే.. కరోనా వ్యాక్సిన్ వేయించుకునే ముందు, వేయించుకున్నాక.. ఎటువంటి మానసిక ఒత్తిడికీ గురికాకూడదు అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ వేయించేసుకుంటే దాని పది అది చూసుకుంటుందని అనుకుంటే పొరపాటు. ఎటువంటి వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేయాలన్నా మన శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. పోషకాలన్నీ పుష్కలంగా ఉండాలి. అందుకే.. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, కోడి గుడ్లను ఎక్కువగా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే.. వేరుశనగలు, పిస్తా, బాదం, జీడిపప్పు వంటివి తీసుకోవాలి. కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉండే చిలగడ దుంప, క్యారెట్ వంటివి క్రమం తప్పకుండా తింటూ ఉండాలి. నిత్యం పాలు లేదా పెరుగు మన మెనూలో కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
బలమైన ఆహారం ఎంత తిన్నా వేళకు సరైన నిద్ర లేకపోతే రోగ నిరోధక శక్తి శక్తివంతంగా పని చేయదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. చాలా మంది నిద్ర విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. రోజుకు కచ్చితంగా 7 లేదా 8 గంటల దీర్ఘ నిద్ర అవసరం అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కొంత మంది మధ్యాహ్నం 3 గంటలు, రాత్రి 5 గంటలు పడుకుంటారు. రోజులో మొత్తం 8 గంటల నిద్రపోయినట్టే లెక్క కదా అని అనుకుంటారు. కానీ ఇలా చేసే కంటే.. ఒకేసారి 7 నుంచి 8 గంటలు పడుకుంటే మంచిదట.
మనం నిద్రపోయే సమయంలో శరీరంలో జరిగే జీవ క్రియ.. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఉపకరిస్తుందట. అలాగే.. సరిగా నిద్రపోని వ్యక్తులు తీవ్ర ఒత్తిడి, డిప్రెషన్‌కు గురవుతారని.. ఈ ప్రభావం రోగ నిరోధక శక్తిపై పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోయేవారితో పోల్చితే 5 నుంచి 6 గంటలు మాత్రమే పడుకునే వారిలో కొన్ని రకాల వ్యాక్సన్లు 50 శాతం తక్కువ సమర్థవంతంగా పని చేస్తాయని ఇంగ్లండ్‌లో జరిగిన ఓ పరిశోధన ద్వారా బయటపడింది.
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది పెద్ద, ముఖ్య విషయమే. అలా అని రోజువారీ పనులను పక్కన పెట్టేయకూడదు. ముఖ్యంగా మన దినచర్యలో ముఖ్య భాగమైన ఎక్సర్‌సైజ్‌కి బ్రేక్ ఇవ్వకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం చేసే అలవాటు లేని వారు వ్యాక్సినేషన్ వేయించుకున్నాకైనా ప్రారంభించాలి. కనీసం ఇంట్లో రోజూ అరగంటపాటు నడిస్తే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఎక్కువ శారీరక శ్రమ చేసేవారి శరీరం ఎటువంటి వ్యాక్సిన్‌కైనా త్వరగా స్పందిస్తుందని చెబుతున్నారు. అందుకే.. ఏ వ్యాక్సినైనా సమర్థవంతంగా, విజయవంతంగా, వేగంగా పని చేయాలంటే శారీరక శ్రమ చాలా అవసరం. కరోనా వ్యాక్సిన్ కూడా దీనికి మినహాయింపు కాదు.