అజ్ఞాతవాసి… తెలుగు బుల్లెట్ రివ్యూ

Agnathavasi Movie review

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :  పవన్ కళ్యాణ్, అను  ఇమ్మానుయేల్, కీర్తి  సురేష్,  కుష్బూ 
నిర్మాత: రాధాకృష్ణ  
దర్శకత్వం : త్రివిక్రమ్ 
సినిమాటోగ్రఫీ: మనికందన్ 
ఎడిటర్ :  కోటగిరి వెంకటేశ్వరరావు 
మ్యూజిక్ : అనిరుద్ రవిచందర్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , ఇంటెలిజెంట్ దర్శకుడు త్రివిక్రమ్…ఈ ఇద్దరి కలయిక సినిమా పరం గా, వ్యక్తిగతం గా కూడా సంచలనమే. వీరి కలయిక సినిమాపరంగా జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చింది. ఇక వ్యక్తిగతంగా వీరి మధ్య స్నేహం గురించి చెప్పక్కర్లేదు. ఆ ఇద్దరూ ముచ్చటగా మూడోసారి కలిసి చేసిన సినిమా అజ్ఞాతవాసి. లార్గో వించ్ అనే ఓ సక్సెస్ ఫుల్ ఫ్రెంచ్ సినిమాని కాపీ కొట్టారని పుకార్లు రావడం, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ పవన్ ని టార్గెట్ చేయడం, జనసేన వచ్చే ఎన్నికల బరిలోకి దిగుతుందని భావించడం, సంక్రాంతి పండగ రావడం వంటి విషయాలతో అజ్ఞాతవాసి మీద స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టు అజ్ఞాతవాసి సినిమా వుందో, లేదో చూద్దాం.

కథ…

గోవింద్ భార్గ‌వ్ అలియాస్ విందా అనే వ్యాపారవేత్త, విందాని అతని కొడుకుని కొందరు చంపేస్తారు. ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుందామని ఆశతో భాగస్వాములైన వర్మ, శర్మ ఈ హత్య చేయించి ఉంటారని విందా భార్య ఇంద్రాణికి ఓ సాక్ష్యం దొరుకుతుంది. అది నిజమో, కాదో తెలుసుకునేందుకు, అది నిజమైతే వారి అంతు తేల్చేందుకు ఆమె కోసం ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో వుండే అభి షిక్థ్ భార్గ‌వ్( పవన్ కళ్యాణ్ ) రంగంలోకి దిగుతాడు. అతనికి, విందాకి వున్న సంబంధం ఏంటి ? విందాని చంపింది ఎవరు ? అతనిపై అభి షిక్థ్ భార్గ‌వ్ పగతీర్చుకున్నాడా? ఈ క్రమంలో అతను అనుసరించిన దారి ఏమిటి ? చివరకు ఏమి సాధించాడు ? విందా వ్యాపార సామ్రాజ్యం ఏమైంది అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ…

డబ్బు సంపాదించేకొద్దీ, ఎదిగే కొద్దీ మన పక్క మనుషుల్లోనే వచ్చే స్వార్ధాన్ని తట్టుకోలేక ఓ వ్యాపారవేత్త తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలతో కఠిన నిర్ణయం తీసుకుంటాడు. కన్న కొడుకునే డబ్బుకి దూరంగా పెంచాలని నిర్ణయించుకుంటాడు. అలాంటి వ్యాపారవేత్త ని కొందరు చంపేస్తే వచ్చిన ఆ కొడుకు ఏమి చేశాడన్న కథ అనుకున్నప్పుడే ఇది గంభీరమైన విషయం అనిపిస్తుంది. ఇక త్రివిక్రమ్ మాటల్లో చెప్పాలంటే రాజ్యం మీద వ్యామోహం లేనివాడి కన్నా మంచి రాజు ఎక్కడ ఉంటాడు అన్న పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. కానీ కధనంలో ఆ పెంపకం వేరే ప్రాంతంలో జరిగిందని చెప్పడం తో సరిపెట్టారు. ఆ పెంపకం వల్ల హీరో పరిణితితో వ్యవహరించినట్టు ఎక్కడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. సరే పెద్ద హీరోని, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ని పెట్టుకున్నపుడు వినోదానికి పెద్ద పీట వేయాలి అనుకుంటే ఆ సందర్భాన్ని కూడా సరిగ్గా వాడుకోలేకపోయారు. ఇద్దరు హీరోయిన్స్ మధ్య హీరో అన్న ఫస్ట్ హాఫ్ ఎపిసోడ్ లో ఓ ఇంటరెస్టింగ్ పాయింట్ వుంది. ఓ హీరోయిన్ ప్రాబ్లెమ్ తనదిగా చెప్పి ఇంకో హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడం అన్నది కొత్తగా అనిపించినా దాన్ని కొనసాగించే సీన్స్ పక్కా నాటుగా తయారు అయ్యింది. ఇక సెకండ్ హాఫ్ లో అభి షిక్థ్ భార్గ‌వ్ గా పరిచయం అయ్యాక కూడా తాను వచ్చిన పని వదిలేసి హీరో చేసే పనులు, కామెడీ కూడా త్రివిక్రమ్ స్థాయికి తాగింది కాదు. ఇక హీరో, విలన్ మధ్య ఎక్కడా కాన్ఫ్లిక్ట్ బిల్డ్ కాలేదు. పవన్, ఆది బాగా చేసినా వారిని వాడుకోవడంలో త్రివిక్రమ్ వైఫల్యం కనిపించింది.

కథ బాగుంది, కధనం బాగాలేదు అనుకున్నా అక్కడక్కడా త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ పేలాయి. జీవితాన్ని, డబ్బుని, మనిషి స్వబ్బావాన్ని విశ్లేషించేందుకు అతను అక్కడక్కడా నలుగురికీ పనికొచ్చే నాలుగు మంచి మాటలు చెప్పాడు. అయితే వాటితోటే ప్రేక్షకుడు సంతృప్తిగా బయటకు వెళతాడు అనుకుంటే అంతకు మించిన పొరపాటు ఉండదు. చెప్పే మంచి మాటలు ఎక్కడ ఏ సందర్భంలో చెబుతున్నాం అన్నది కూడా ముఖ్యం.

ఇక్కడ త్రివిక్రమ్ కి ఓ విషయం గుర్తు చేయాలి అనిపిస్తుంది. అదే భగవద్గీత. కొన్ని వందల, వేల ఏళ్లుగా మానవాళి కి ఉపయోగపడే గొప్ప విషయాల్ని కృష్ణుడు గీతలో అర్జునుడుకి బోధించాడు. అయితే దాన్ని విడిగా 700 శ్లోకాలకి మాత్రమే పరిమితం చేయొచ్చు. కానీ అంత గొప్ప విషయం చెప్పాలంటే దానికి తగిన నేపధ్యం వుండాలని, వినేవాడికి దాని అవసరం వుండాలని తెలిసే మొత్తం 18 పర్వాలున్న మహాభారతంలో ఇమిడ్చారు. అర్జునుడుకి సంకట పరిస్థితి ఎదురైనప్పుడే కృష్ణుడు గీత బోధించాడు. అలాగే త్రివిక్రమ్ కూడా ఓ మంచి విషయం చెప్పాలి అనుకుంటే కథ,కధనం రూపంలో అందుకు తగ్గ నేపధ్యం సృష్టించాలి.

ప్లస్ పాయింట్స్ …
పవన్ కళ్యాణ్
కథ
ఖుష్బూ
అనిరుద్ సంగీతం
మణికందన్ కెమెరా
అక్కడక్కడా త్రివిక్రమ్ డైలాగ్స్

మైనస్ పాయింట్స్ …
కధనం
కామెడీ స్థాయి.

ఖుష్బూ మినహా ఒక్క బలమైన క్యారెక్టర్ కూడా రిజిస్టర్ కాలేదు.
ప్రేక్షకుడు ఎక్కడా కథ, కధనంలో కనెక్ట్ అయ్యే సీన్స్ లేవు .

తెలుగు బులెట్ పంచ్ లైన్… త్రివిక్రమ్ రాంగ్ గైడెన్స్ తో దారి తప్పిన అజ్ఞాతవాసి
తెలుగు బులెట్ రేటింగ్… 2.5 / 5 .