ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ తమిళ స్టార్ హీరో ధనుష్. సమాజంలోని అమానవీయ కోణాన్ని ప్రయోగాత్మకంగా తెర కెక్కించి బాక్సాఫీసును షేక్ చేయడమే కాదు జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న గొప్ప నటుడు ధనుష్. సినిమా చూసిన వెంటనే జాతీయ అవార్డు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించిన అసామాన్య హీరో. అందులోనూ ఒకే వేదికపై పిల్లనిచ్చిన మామతో కలిసి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుని కొత్త చరితను లిఖించాడు ధనుష్.
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తమిళ సూపర్ స్టార్లు ధనుష్, తలైవా రజనీకాంత్ కొత్త చరిత్రను లిఖించారు. సినిమా చరిత్రలో ఒకేసారి ఒకే వేదికపై, ఒకే కుటుంబంలో ఇద్దరు లెజెండ్స్ రెండు ఉత్తమ జాతీయ అవార్డులు గెల్చుకుని చరిత్ర సృష్టించారు. రజనీకాంత్ 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోగా, ధనుష్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్నారు.అందుకే రజనీకాంత్ కుమార్తె, ధనుష్ భార్య ఐశ్వర్య సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది.
ఈ చారిత్రాత్మక విజయాన్ని సెలబ్రేట్ చేసు కుంటోంది. ‘‘వాళ్లిద్దరు నావాళ్లే. ఇదొక చరిత్ర’’ అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా భార్యగా, కుమార్తెగా గర్వపడుతున్నానంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నిజానికి సినీ ప్రేమికులంతా కూడా ఈ అరుదైన సందర్భాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అటు ధనుష్ కూడా తాజా పురస్కారాలపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఆనందాన్ని వర్ణించలేనంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు.