అక్కినేని అఖిల్ టైం ఏమాత్రం బాగున్నట్లుగా అనిపించడం లేదు. మొదటి రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో మూడవ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని నటించిన విషయం తెల్సిందే. కాని ఆ చిత్రం విడుదల విషయంలో గందరగోళం నెలకొంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడవ సినిమా రూపొందింది. ఈ చిత్రంకు ‘మిస్టర్ మజ్ను’ అనే టైటిల్‌ను ఖరారు చేసి ఇప్పటికే టీజర్‌ను కూడా విడుదల చేశారు. సినిమాను వచ్చే జనవరి రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే తాజాగా ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 24న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దాంతో అఖిల్ ఆలోచనల్లో పడ్డట్లుగా సమాచారం అందుతుంది.
‘మిస్టర్ మజ్ను’ చిత్రాన్ని మొదట డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించారు. కాని డిసెంబర్‌లో రెండు మూడు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో సోలోగా రిలీజ్ ప్లాన్ చేయానే ఉద్దేశ్యంతో రిపబ్లిక్ డేను ఎంపిక చేయడం జరిగింది. కాని రిపబ్లిక్ డే సందర్బంగానే ‘ఎన్టీఆర్’ రెండవ పార్ట్‌ను విడుదల చేయాలని క్రిష్ నిర్ణయించుకోవడంతో సినిమాకు పెద్ద కష్టం వచ్చి పడినది. ‘మిస్టర్ మజ్ను’ చిత్రం కంటే భారీగా ‘ఎన్టీఆర్’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. అలాంటి సమయంలో రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయితే ఖచ్చితంగా ఎన్టీఆర్ వైపుకు ప్రేక్షకులు మొగ్గే అవకాశం ఉంది. అందుకే తన చిత్రం విడుదల తేదీ విషయంలో నిర్ణయాన్ని మార్చుకోవాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.