అప్పుడే ఇంత సాహసమా?

Akhil Doing Playboy Role in his Third Film

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌పై ఫ్యాన్స్‌ పెట్టుకున్న నమ్మకం వమ్ము అయ్యింది. అఖిల్‌ చేసిన రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడ్డాయి. ముఖ్యంగా మొదటి సినిమా ఏకంగా 25 కోట్ల మేరకు నష్టాలను మిగిల్చినట్లుగా సమాచారం అందుతుంది. అఖిల్‌ రెండవ సినిమా ‘హలో’ తక్కువ బడ్జెట్‌తో రూపొందినది కనుక కాస్త పర్వాలేదు. ప్రస్తుతం అఖిల్‌ మూడవ సినిమా చేస్తున్నాడు. ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై అక్కినేని ఫ్యాన్స్‌ ఆశలు పెట్టుకుని ఉన్నారు. సంచలన విజయాన్ని కాకున్నా కనీసం సక్సెస్‌ను అయినా ఈ చిత్రం దక్కించుకుంటుందా అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతుంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం కథ రీత్యా హీరో లండన్‌ బేస్డ్‌ ఎన్నారై. లండన్‌లో ప్లే బాయ్‌ అయిన హీరో, ఇండియాకు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనే విషయంతో కథను దర్శకుడు వెంకీ అల్లినట్లుగా తెలుస్తోంది. యువ హీరోలు ప్లేబాయ్‌గా నటించడం అంటే సాహసంతో కూడిన నిర్ణయం. రెండు సినిమాల వయస్సుతోనే అఖిల్‌ అప్పుడే ప్లే బాయ్‌గా నటించడం చర్చనీయాంశం అవుతుంది. ప్లే బాయ్‌గా నటించేందుకు అఖిల్‌ ఒప్పుకోవడంను కొందరు తప్పుబడుతున్నారు. ఇప్పటికే అఖిల్‌పై విమర్శలు ఉన్నాయి. పెళ్లి వరకు వెళ్లిన అఖిల్‌ క్యాన్సిల్‌ చేసుకున్నాడు. ఇప్పుడు అఖిల్‌ ప్లే బాయ్‌గా నటించడం అంటే పెద్ద మచ్చను మోయడమే అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.