అమ్మపై అమల ఆగ్రహం

Akkineni amala about AMMA Decision On Dileep

మలయాళ నటిపై లైంగిక వేదింపుల కేసులో ప్రధాన నిందితుడు అయిన నటుడు దిలీప్‌ ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చాడు. కొన్నాళ్ల పాటు జైల్లో ఉన్న దిలీప్‌ కేసు విచారణ జరుగుతుంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన హీరోయిన్‌ కిడ్నాప్‌ మరియు లైంగిక వేదింపుల కేసులో దిలీప్‌ దోషిగా ఉన్న నేపథ్యంలో ఆయన్ను మలయాళ సినీ పరిశ్రమ మొత్తం బహిష్కరించిన విషయం తెల్సిందే. అసోషియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్టు(అమ్మ) నుండి ఆయన్ను తొలగిస్తున్నట్లుగా అప్పట్లో మోహన్‌లాల్‌ ప్రకటించాడు. తాజాగా దిలీప్‌ బెయిల్‌పై బయటకు రావడం, తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో దిలీప్‌ను మళ్లీ అమ్మలోకి తీసుకోవడం చర్చ నీయాంశం అవుతుంది. దిలీప్‌ను అమ్మలోకి తీసుకోవడంపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయమై అక్కినేని అమల తనదైన శైలిలో స్పందించారు.

తాజాగా అమల మీడియాతో మాట్లాడుతూ.. మలయాళ ఆర్టిస్టు అసోషియేషన్‌ తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సరైనది కాదని, ఇలాంటి నిర్ణయం వారు ఎలా తీసుకున్నారో అర్థం కావడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఒక మహిళను వేదించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, బెయిల్‌పై బయట ఉన్న వ్యక్తికి ఎలా అమ్మలో సభ్యత్వం ఇస్తారు అంటూ మోహన్‌లాల్‌ను ఈమె ప్రశ్నించింది. దిలీప్‌ తనపై వచ్చిన ఆరోపణలను తప్పుడు ఆరోపణలుగా నిరూపించుకుంటే సరే అనుకోవచ్చు. కాని ఆయన ఇప్పటికి కోర్టు కేసును ఎదుర్కొంటున్నాడు, ఎలా ఆయన సభ్యత్వంను పునరుద్దరిస్తారు అంటూ అమల ప్రశ్నిస్తుంది. మహిళ సంఘాల వారు కేరళలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. వారి ఆందోళనకు అమల మద్దతు పలికారు. వెంటనే దిలీప్‌ను అమ్మ నుండి తొలగించాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.