Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తిండి లేక చిన్నారులు విద్యకు దూరం కాకూడదన్న ఉన్నతమైన ఆశయాలతో, విద్యా బుద్ధులు నేర్వటానికి ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న నిరుపేద విద్యార్థుల ఆకలిని తీర్చేందుకు మధ్యాహ్న భోజనం అందిస్తోంది అక్షయపాత్ర సంస్థ. 2000 సంవత్సరంలో హరేకృష్ణ మూవ్‌మెంట్ సంస్థ(ఇస్కాన్ బెంగుళూరు) ఆధ్వర్యంలో భారతదేశంలో కేవలం 5 ప్రభుత్వ పాఠశాలలోని 1,500 మంది విద్యార్థుల కోసం ప్రారంభం అయిన అక్షయపాత్ర ఈ రోజు ఇంతింతై వటుడింతై అన్న తీరున దేశంలోని 12 రాష్ర్టాల్లో 14,000 పాఠశాలలో చదువుతున్న 16 లక్షల మంది విద్యార్థులకు అధునాతమైన వంటశాలల ద్వారా రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజన రూపంలో అందిస్తూ ఉన్నత స్థానానికి చేరుకుంది. ఈ రోజుల్లో 5 రూపాయలకు ఏం వస్తుంది. అందులో రాజధాని హైదరాబాద్ నగరంలో సింగిల్ టీ కూడా రాదు. అటువంటింది కేవలం 5 రూపాయలకు భోజనాన్ని అందిస్తు దాదాపు 30వేల మందికి ఆకలిని అతి తక్కువ ధరలో తీరుస్తోంది కూడా ఇదే సంస్థ.
హరేక్రిష్ట ఉద్యమం ప్రారంభించిన అక్షయపాత్ర ద్వారానే ఈ కార్యక్రమం క్రింద ఐదు రూపాయలకు భోజనాన్ని పేద వారికి అందిస్తున్నారు నిర్వహకులు. హరేక్రిష్ణ ఉద్యమానికి వెన్నుదన్నుగ నిలచే దాతలనుంచి విరాళాలను అక్షయపాత్ర పేరుతో స్వీకరిస్తుంది.దీనికి వచ్చే విరాళాలను చిన్నారుల చదువులకు, వారి భోజనానికి ఖర్చు చేస్తారు. అక్షయపాత్రకు అందించే విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపుకూడా లభిస్తుంది. ఏది ఏమైనా వంట సరుకు ధరలు ఆకాశాన్ని అంటుతుంటే అన్ని వండి వార్చి రుచికరమైన భోజనంగా మలచి శ్రమను సైతం లెక్క చేయకుండా ఎందరి ఆకలినో తీరుస్తున్న ఈ పధకాలు నిజం పేదలపాలిట పెన్నిధిలాంటివి. మానన సేవే మాధవ సేవగా సాగుతున్న అక్షయ పాత్ర సేవలు మరిన్ని కాలాల పాటు కొనసాగాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.