ఇంకా వారమైనా కాలేదు…అప్పుడే పార్టీలో చీలిక !

Alagiri makes sensational comments on stalin
కరుణానిధి కన్నుమూసి పట్టుమని పదిరోజులైనా కాలేదు ఆయన తర్వాత పార్టీకి పెద్దదిక్కు ఎవరు అనే విషయం మీద కుటుంబంలో ఆధిపత్య పోరు ప్రారంభమైందని తెలుస్తోంది. దీనికి కారణం కరుణ పెద్ద కొడుకు, మాజీ కేంద్రమంత్రి అళగిరి, నిన్న తండ్రి సమాధిని దర్శించుకున్న అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట కలకలం రేపుతున్నాయి. పార్టీ బాధ్యతలను స్వీకరించేందుకు స్టాలిన్ సిద్ధమవుతున్న వేళ అళగిరి తెరపైకి వచ్చారు. కరుణ స్మారక ప్రాంతం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్టాలిన్ నాయకత్వానికి సవాల్ విసిరారు. డీఎంకే కేడర్ మొత్తం తన వెనకే ఉందని, నిజమైన డీఎంకే నేతలంతా తనవైపే ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Alagiri And stalin
పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను బాధిస్తున్నాయని, కాలమే దీనికి సరైన సమాధానం చెబుతుందని ఆయన అన్నారు. తన తండ్రి ఆప్తులంతా తనవైపే ఉన్నారని, రాష్ట్రంలోని పార్టీ మద్దతుదారులంతా తననే కోరుకుంటున్నారని అళగిరి చెప్పారు. ప్రస్తుతానికి తాను ఇంతవరకు మాత్రమే చెప్పగలనని అన్నారు. పార్టీకి చెందిన సర్వసభ్య సమావేశం కానున్న ఒక్క రోజు ముందు అళగిరి ఈ వ్యాఖ్యలు చేయడం, డీఎంకేలో కలకలం రేపుతున్నాయి.
Alagiri Speech
సమావేశం ప్రధాన అజెండా కరుణకి నివాళులు అర్పించడమే అయినా స్టాలిన్ ను పార్టీ అధినేతగా ప్రకటించే జనరల్ కౌన్సిల్ సమావేశం తేదీని రేపటి సమావేశంలో ప్రకటించే అవకాశం ఉందని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. 1969లో అన్నాదురై చనిపోయినప్పుడు కూడా ఇదే మాదిరి జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి కరుణకి బాద్యతలు అప్పచెప్పారు.