ఆలిండియా నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ శ్రీదేవి

All India Number 1 Heroine Sridevi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దివికేగిపోయిన అతిలోక సుంద‌రి జీవితం మొత్తం సినిమాల్లోనే గ‌డిచిపోయింది. నాలుగేళ్ల వ‌య‌సులోనే కెమెరా ముందుకొచ్చిన శ్రీదేవి చివ‌రిదాకా న‌టిస్తూనే గ‌డిపారు. ద‌క్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్లి హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌నేలిన శ్రీదేవికి , అన్ని భాష‌ల్లోని అంద‌రు హీరోయిన్ల‌కు చాలా తేడా ఉంది. మామూలుగా హీరోయిన్లు ఒక‌టి, లేదా రెండు భాష‌ల్లో స్టార్ హీరోయిన్ల‌గా, నెంబ‌ర్ వ‌న్ క‌థ‌నాయిక‌ల‌గా కొన‌సాగుతుంటారు. కానీ శ్రీదేవి తెలుగు, త‌మిళ, మ‌లయాళ భాష‌లతో పాటు హిందీలోనూ ఏక‌కాలంలో స్టార్ డం సంపాదించారు. అలాగే బాలీవుడ్ లో ఒక‌ప్పుడు నంబ‌ర్ వ‌న్ హీరోయిన్లుగా ఉన్న రేఖ‌, హేమ‌మాలిని వంటివారు కూడా దక్షిణాది నుంచి హిందీ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లిన‌వారే.

కానీ వారు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు అయ్యారు కానీ..ద‌క్షిణాదిన అంత గుర్తింపు పొంద‌లేక‌పోయారు. కానీ శ్రీదేవి మాత్రం ఉత్త‌ర‌,దక్షిణాదిలో పాపుల‌ర్ అయి ఆలిండియా నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అనిపించుకున్నారు. శ్రీదేవికి గ‌ట్టి పోటీ ఇచ్చి త‌ర్వాత కాలంలో బాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా వెలుగొందిన మాధురీ దీక్షిత్ అయినా, అప్ప‌టినుంచి ఇప్ప‌టిదాకా హిందీలో రాణిస్తున్న ఏ హీరోయిన్ అయినా ఉత్త‌రాదికే ప‌రిమితం. ఐశ్వ‌ర్యారాయ్ కూడా  ఇందుకు మిన‌హాయింపు కాదు. భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌లో దేశ‌వ్యాప్తంగా ఒకేస్థాయి గుర్తింపు ఉన్న ఏకైక హీరోయిన్ శ్రీదేవినే. తెలుగు, త‌మిళ‌, హిందీలో అప్ప‌టి అగ్ర‌హీరోలందరితో శ్రీదేవి న‌టించారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్ష‌కులు శ్రీదేవికి బ్ర‌హ్మ‌ర‌థం పట్టారు. త‌న కెరీర్ లో 260కు పైగా సినిమాలు చేసిన శ్రీదేవి తెలుగులోనే ఎక్కువ చిత్రాల్లో న‌టించారు. తెలుగులో కృష్ణ‌, త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్, హిందీలో జితేంద్ర‌తో శ్రీదేవి హిట్ పెయిర్ గా పేరొందారు. హిందీలో తొలిరోజుల్లో ఆమె త‌న తెలుగు సినిమా రీమేక్ ల్లోనే ఎక్కువ‌గా న‌టించారు. కె. రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ష‌న్ లో చేసిన సినిమాలు ఆమె బాలీవుడ్ కెరీర్ కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయి.
1983లో తెలుగు వ‌జ్రాయుధం రీమేక్ గా హిందీలో వ‌చ్చిన హిమ్మ‌త్ వాలా శ్రీదేవి న‌ట‌జీవితాన్ని మార్చివేసింది. ఆ త‌ర్వాత ల‌మ్హే సినిమాతో ఆమెకు స్టార్ డం వ‌చ్చింది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస‌గా హిందీ సినిమాల్లో న‌టిస్తూ బాలీవుడ్ అగ్ర‌క‌థానాయిక‌గా ఎదిగారు. బాలీవుడ్ లేడీ సూప‌ర్ స్టార్ గా ఆ ఘ‌న‌త సాధించిన తొలి న‌టిగా రికార్డు సృష్టించారు. 1996లో సినిమాల‌కు దూర‌మైనా…ఆమెను బాలీవుడే కాదు..తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కులు కూడా మ‌ర్చిపోలేదు. 2012లో ఆమె రీఎంట్రీ ఇచ్చిన ఇంగ్లిష్ వింగ్లిష్, 2017లో వ‌చ్చిన మామ్ చిత్రాల‌ను శ్రీదేవి కోరిక‌మేర‌కే ఆయా  నిర్మాత‌లు తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ చేశారు. హీరోయిన్ గా దేదీప్య‌మానంగా వెలుగొందిన కాలంలోనే కాదు…ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా గృహిణిగా స్థిర‌ప‌డ్డ రోజుల్లోనూ ఆమెను అంతా ఎవ‌ర్ గ్రీన్ హీరోయిన్ గానే భావించారు. సీఎన్ ఎన్-ఐబీఎన్ 2013లో నిర్వ‌హించిన జాతీయ‌స్థాయి స‌ర్వేలో ఈ శ‌తాబ్దంలోనే గొప్ప‌న‌టిగా శ్రీదేవి ఎంపిక‌కావ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం.