యూపీలో కుదిరిన పొత్తు…దశాబ్దాల పగకి చెక్ !

నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీకి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమయింది. దేశ ప్రధానిని డిసైడ్ చేసే ఉత్తరప్రదేశ్ లో ఉప్పు-నిప్పుగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కలిసి పోయాయి. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు గానూ చెరో 38 చోట్ల పోటీ చేయాలని ఆ పార్టీలు నిర్ణయించాయి. అయితే కూటమిలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోనప్పటికీ అమేథీ (రాహుల్ గాంధీ సిట్టింగ్ స్థానం), రాయ్ బరేలీ(సోనియా గాంధీ సిట్టింగ్ స్థానం) స్థానాల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశాయి. మిగిలిన రెండు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయిస్తామని పేర్కొన్నాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి యూపీ రాజధాని లక్నోలో ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను ప్రకటించారు.ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ ఈ కూటమితో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిద్రలేని రాత్రులు గడపబోతున్నారని, కాంగ్రెస్ విధానాల కారణంగానే మాలాంటి పార్టీలు ఉనికిలోకి వచ్చాయి.

యూపీలో కుదిరిన పొత్తు...దశాబ్దాల పగకి చెక్ ! - Telugu Bullet

కాంగ్రెస్ లేదా బీజేపీ.. ఎవరు అధికారంలోకి వచ్చినా తేడా ఏమీ లేదని, కాంగ్రెస్ తో జతకట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని ఆమె చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాల కోసం విభేదాలను, గెస్ట్ హౌస్ గొడవను పక్కనపెట్టి మేం చేతులు కలపాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ..‘మాయావతి గారిని అవమానిస్తే.. నన్ను వ్యక్తిగతంగా అవమానించినట్లే’ అని సమాజ్ వాదీ కార్యకర్తలను పరోక్షంగా హెచ్చరించారు. దాదాపు 25 ఏళ్ల క్రితం లక్నోలోని ఓ గెస్ట్ హౌస్ లో మాయావతిపై సమాజ్ వాదీ కార్యకర్తలు దాడిచేశారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది యూపీలోని గోరఖ్ పూర్ సహా మూడు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. అందులోనుండే విపక్ష కూటమి అనే ఆలోచన మొగ్గతొడిగింది. అయితే ఇది కాంగ్రెస్ బీజేపీ యేతర కూటమి అయిన ఫెడరల్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.