వర్మా నువ్వో ద్రోహివి… నికృష్టుడివి !

Allu Aravind angry on Ram Gopal Varma

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తనను ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది తనను అవకాశాల కోసం వాడుకున్నారంటూ సినీ ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ అనేదే లేకుండా చేస్తానంటూ పోరాటం మొదలుపెట్టిన ఆమె, ఇప్పుడు పక్కదోవ పట్టినట్టు అయ్యింది. ఒకరకంగా శ్రీరెడ్డి పోరాటాన్ని రామ్‌గోపాల్ వర్మ హైజాక్ చేసినట్లయింది. క్యాస్టింగ్ కౌచ్ ఝాడ్యం నుంచి తెలుగు ఇండస్ట్రీని కాపాడాలన్న నినాదం కాస్తా… పవన్ ని కార్నర్ చేసేలా చేసింది. పవన్‌కళ్యాణ్ మీద బూతులందుకున్న శ్రీరెడ్డి వెనుక ఎవరున్నారో తేటతెల్లం అయ్యే సరికి ఇక తాడో పేడో తేల్చుకుందామని మెగా ఫ్యామిలీ డిసైడ్ అయిపోయినట్టే ఉంది.

విషయం వెల్లడి కాక ముందే మంగళవారం నాడు నాగబాబు ప్రెస్‌మీట్ పెట్టి ఒక శ్రీ రెడ్డిని కడిగేశాడు. ఇప్పుడు వర్మ పేరు లైన్ లోకి వచ్చిన నేపధ్యంలో వర్మ మీద తీవ్రంగా దాడి చేయడం కోసం మెగా‌క్యాంప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అల్లు అరవింద్ మీడియా ముందర వర్మని తూర్పార బట్టాడు. నా టార్గెట్ రాం గోపాల్ వర్మ అంటూ మొదలు పెట్టిన అల్లు అరవింద్. వర్మ వైఖరికి అందరూ బాధపడుతున్నారని, వర్మ వీడియోలు రాత్రి చూశానని అల్లు అరవింద్ చెప్పారు. రాంగోపాల్ వర్మ అండ్ కో పెద్ద నాటకం ఆడిందని వ్యాఖ్యానించారు.

వర్మ చేబుతునట్టు సురేష్ బాబు తో అతను ఏమీ మాట్లాడలేదని ఈ ప్రెస్ మీట్ కి ముందరే తానూ సురేష్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో తాను మాట్లాడానని, వాళ్ళు చట్టపరంగానే దీనిని ఎదుర్కొంటామని చెప్పినట్లు అల్లు అరవింద్ స్పష్టం చేశారు. సో ఇదంతా వర్మ కుట్రేనని, వర్మ భ్రష్ట మేధావి అని అల్లు అరవింద్ తిట్టిపోశారు. వర్మ తెలుగు పరిశ్రమ నుంచి ఎదిగారని, తల్లి లాంటి పరిశ్రమకు వర్మ ద్రోహం చేస్తున్నారని ‘శ్రీరెడ్డితో తిట్టించింది నేనే’ అని వర్మ చెప్పడం బాధాకరమని ఆయన చెప్పారు. వర్మ తప్పుదోవ పట్టించాడని శ్రీరెడ్డి చెబుతోందని, రాంగోపాల్‌వర్మ నికృష్టుడని అల్లు అరవింద్‌ విమర్శించారు.

రామ్‌గోపాల్ వర్మ ఎలాంటి నికృష్ణుడో చెప్పడానికే ఇక్కడికి వచ్చానని ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంగోపాల్‌వర్మ ఆర్థిక పరిస్థితికి తనకు తెలుసని, వర్మ వెనుక ఎవరు ఉన్నారో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘నీ తల్లినో, అక్కనో తిట్టిస్తే బాధ ఎలా ఉంటుందో తెలుసా’? అని వర్మను ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ స్థాయిని తగ్గించేందుకు కుట్ర పన్నారని, పవన్‌ ఒంటరిగా రాజకీయాల్లోకి వెళ్లినా మౌనంగా ఉన్నామని చెప్పారు. ఇలాంటి కుట్రలు పీఆర్పీ సమయంలోనూ జరిగాయని, పవన్ జాగ్రత్త పడాలని ఆయన సూచించారు.

ఇండస్ట్రీ వల్లే బతుకుతోన్న మాకు ఇండస్ట్రీపై కృతజ్ఞత, భక్తి గౌరవం వున్నాయని, శ్రీరెడ్డి వివాదంపై తామంతా చర్చించామని ఇండస్ట్రీలో మహిళల సమస్యల పరిష్కారాల కోసం కమిటీ వేయాల్సి ఉందని అన్నారు. దానికి 50 శాతం ఎన్జీవోలు, 50 శాతం ఇండస్ట్రీకి చెందిన మహిళలతో ఈ కమిటీ ఉంటుందని అన్నారు. అలాగే ఈ కమిటి విచారణ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే ఉంటుందని అరవింద్ ప్రకటించారు. ఓ నిర్మాత తప్పుడు పని చేస్తే నిర్మాతల మండలి నుంచి తొలగిస్తాం. దర్శకుడు, ఇతర ప్రముఖులు ఎవరయినా తప్పుడు చర్యలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటాం’ అని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. బాహుబలి వంటి అద్భుతమైన సినిమాలు నిర్మించి ఛాతీ విరుచుకొని గొప్పగా నిలబడ్డ మన టాలీవుడ్‌ ఇప్పుడు కొందరి వల్ల తలదించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.