శ్రీకాంత్‌ అడ్డాలను నమ్మిన అల్లు అరవింద్‌

allu aravind to produce Srikanth Addala next movie

 Posted November 14, 2017 at 17:40 

దర్శకుడిగా కెరీర్‌ ఆరంభించి పుష్కర కాలం దాటి పోయినా కూడా ఇప్పటి వరకు పట్టు మని అరడజను సినిమాలు చేయలేదు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలు. ‘కొత్తబంగారులోకం’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న శ్రీకాంత్‌ అడ్డాల ఆ తర్వాత భారీ మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మల్టీస్టారర్‌ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి ఫలితాన్ని ఇవ్వడంతో మహేష్‌బాబు మరో అవకాశాన్ని శ్రీకాంత్‌ అడ్డాలకు ఇవ్వడం జరిగింది. ‘బ్రహ్మోత్సవం’ను తెరకెక్కించిన శ్రీకాంత్‌ అడ్డాల సూపర్‌ స్టార్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

‘బ్రహ్మోత్సవం’ తర్వాత శ్రీకాంత్‌ అడ్డాల చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. ఎట్టకేలకు తన తర్వాత సినిమా పనుల్లో పడ్డాడు. అయితే ఈసారి శ్రీకాంత్‌ అడ్డాలను అల్లు అరవింద్‌ నమ్మడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. అల్లు అరవింద్‌కు శ్రీకాంత్‌ అడ్డాల చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చడంతో వెంటనే నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. అల్లు అరవింద్‌ సన్నిహితుడు, బన్నీ వాసు ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాలతో సినిమాను నిర్మించే పనిలో ఉన్నాడు. వచ్చే సంవత్సరం ఆరంభంలోనే శ్రీకాంత్‌ కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది. సినిమాలో అంతా కొత్త వారు నటించే అవకాశం కనిపిస్తుంది. కేవలం అయిదు కోట్ల బడ్జెట్‌తో చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అరవింద్‌ చేయి పడ్డ కారణంగా సినిమా ఖచ్చితంగా బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

SHARE