సైరా.. ఈ తేదీ అయినా కన్ఫర్మా

'Sye Raa Narasimha Reddy's' first schedule to start from December 6.

 Posted November 14, 2017 at 17:54 

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ విడుదలై దాదాపు సంవత్సరం కావస్తుంది. అయినా ఇప్పటి వరకు చిరంజీవి 151వ చిత్రం పట్టాలెక్కింది లేదు. ఆగస్టులో చిత్రం షూటింగ్‌కు లాంచనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. కాని ఇప్పటి వరకు రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాలేదు. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో షూటింగ్‌ అన్నారు. కాని ఇప్పటి వరకు షూటింగ్‌ మొదలు పెట్టలేదు. చిరంజీవి లుక్‌ ఫైనల్‌ కాకపోవడం వల్ల ఆలస్యం జరుగుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. చిరంజీవి లుక్‌ నాచురల్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో జుట్టు మరియు గడ్డం పెంచడంతో పాటు, బాడీలో కూడా మార్చులు తెచ్చుకుంటున్నాడు.

ఎట్టకేలకు ఈ డిసెంబర్‌ 6న చిత్రాన్ని సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వేసిన సెట్టింగ్‌లో భారీ యాక్షన్‌ సీన్స్‌ను చిత్రీకరించేందుకు దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకోసం లండన్‌ నుండి దాదాపు 200 మంది జూనియర్‌ ఆర్టిస్టులను రప్పించనున్నట్లుగా తెలుస్తోంది. బ్రిటీష్‌ సైన్యంతో నరసింహారెడ్డి యుద్దం చేసే సీన్స్‌ను మొదట చిత్రీకరించనున్నారు. అతి త్వరలోనే చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దర్శకుడు సురేందర్‌ రెడ్డి పక్కా స్క్రిప్ట్‌ను రెడీ చేసి పెట్టాడు. నటీనటుల ఎంపిక మరియు ఇతరత్ర కార్యక్రమాలు అన్ని కూడా ముగిసి పోయాయి.

ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబచ్చన్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, సుదీప్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. వచ్చే సంవత్సరం చివర్లో లేదా 2019 సంక్రాంతికి అయినా సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. చిరంజీవి కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అని, ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ రికార్డును బ్రేక్‌ చేయడం ఖాయం అంటున్నారు.

SHARE