వేరే భాషల హీరోలను మనోళ్లు నెత్తిన పెట్టుకోవడమే చూశాం చాలా ఏళ్లు. ఐతే గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. ‘బాహుబలి’తో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. అతడి కంటే ముందు అల్లు అర్జున్ కేరళలో క్రేజ్ సంపాదించుకుని అక్కడ స్టార్ హీరోగా మారాడు. అతడి చిత్రాలు ప్రతి ఒక్కటీ కేరళలో పెద్ద ఎత్తున రిలీజవుతుంటాయి. వాటికి మంచి ఓపెనింగ్స్ కూడా వస్తుంటాయి.
ఐతే ఇప్పటిదాకా బన్నీ సినిమాలకు కేరళలో ఉన్న క్రేజ్ వేరు.. ఇప్పుడు అతడి కొత్త చిత్రం ‘అల వైకుంఠపురములో’కు అక్కడ కనిపిస్తున్న హైప్ వేరు. బన్నీ గత చిత్రాల్ని తెలుగులో రిలీజయ్యాక కొంచెం గ్యాప్ ఇచ్చి కేరళలో రిలీజ్ చేసేవాళ్లు. ప్రమోషన్లు కూడా అందుకు తగ్గట్లే ఉండేవి. కానీ ‘అల..’ విషయంలో మాత్రం ప్లాన్ మారింది. తెలుగు వెర్షన్‌తో పాటు మలయాళ వెర్షన్ డబ్బింగ్ పనులు జరిగాయి. సినిమాను ముందు నుంచే బాగా ప్రమోట్ చేశారు కూడా.
ఈ నెల 12న కేరళలో ‘అల..’ను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అక్కడ పెద్ద హీరోల సినిమాల స్థాయిలో విడుదల ఉండబోతోంది. విశేషం ఏంటంటే.. కేరళ బన్నీ ఫ్యాన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 30 స్పెషల్ షోలు ప్లాన్ చేస్తుండటం విశేషం. తమిళనాడు, కేరళల్లో స్టార్ హీరోల సినిమాలు రిలీజైనపుడు తెల్లవారుజామున బెనిఫిట్ షోలు వేయడం మామూలే. ఐతే ఓ పరభాషా కథానాయకుడి నుంచి వస్తున్న సినిమాకు కేరళలో 30 బెనిఫిట్ షోలు వేయడమంటే చిన్న విషయం కాదు.
ఓ తెలుగు హీరో ఇలాంటి ఘనత సాధించడం విశేషమే. దీన్ని బట్టి బన్నీకి అక్కడ ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి తెలివిగా జయరాం, జీపీ లాంటి ప్రముఖ మలయాళ నటుల్ని.. వాళ్లకు పరిచయం ఉన్న సముద్ర ఖని లాంటి తమిళ నటుడిని తన సినిమాలో కీలక పాత్రలకు తీసుకుని స్ట్రాటజిగ్గా అడుగేశాడు బన్నీ. బన్నీకి తోడు వీళ్ల ఆకర్షణ కూడా తోడై ‘అల వైకుంటపురములో’ కేరళలో పెద్ద విజయం సాధిస్తుందేమో చూడాలి.