సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మపై మళ్లీ వేటు..! పంతం నెగ్గిందా…?

Alok Verma Removed As CBI Director By High Powered Committee

సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ డైరక్టర్ గా మళ్ళీ పదవి చేపట్టిన అలోక్ వర్మపై గంటలు కూడా గడవకుండానే కేంద్ర ప్రభుత్వం మరోసారి వేటు వేసింది. అలోక్ వర్మ పదవి చేపట్టిన వెంటనే.. ఐదుగురు సీనియర్ అధికారుల్ని బదిలీ చేశారు. ఈ క్రమంలో ఆయన మరి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. విధానపరమైన నిర్ణయాలేమీ తీసుకోవద్దని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ అలోక్ వర్మ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తనను బలవంతంగా సెలవుపై పంపినప్పుడు ఇన్ చార్జ్ డైరక్టర్ గా నియమితులైన నాగేశ్వరరావు పలువుర్ని బదిలీ చేశారు. కీలకమైన కేసులు విచారిస్తున్న వారిని కూడా ఆ సమయంలో బదిలీ చేశారు. అలా బదిలి అయిన వారిలో ఐదుగుర్ని మళ్లీ యధావిధిగా పాత స్థానాలకు తెచ్చారు అలోక్ వర్మ. ఈ క్రమంలో ఆయన రాఫెల్ డీల్ కు సంబంధించిన వ్యవహారాలపైనా విచారణకు ఆదేశిస్తారనే ప్రచారం జరిగి, హస్తిన లో హాట్ టాపిక్ అయిన నేపధ్యంలో ఆయనపై మోడీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ వేటు వేసినట్లు ప్రకటించారు.

వారం రోజుల్లో కొత్త సీబీఐ డైరక్టర్ ను నియమిస్తామని అందాకా మొన్న తాత్కాలిక డైరెక్టర్ గా బాద్యతలు నిర్వర్తించిన నాగేశ్వర రావే మళ్ళీ బాద్యతలు నిర్వర్తిస్తారని తెలిపింది. వాస్తవానికి సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లతో కూడిన కమిటీ అలోక్ వర్మపై నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించింది. అయితే కమిటీ నుంచి చీఫ్ జస్టిస్ తప్పుకాగా ఆ స్థానంలోకి జస్టిస్ సిక్రి వచ్చారు. అలోక్ వర్మ బాధ్యతలు చేపట్టిన వెంటనే హుటాహుటిన కమిటీ సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏర్పాటు చేశారు. సీబీఐ డైరక్టర్ గా అలోక్ వర్మ తొలగింపును మోడీతో పాటు సుప్రీంకోర్టు జస్టిస్ సిక్రీ కూడా సమర్థించారు. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై వివరణ అడగాలని కోరినా మోడీ పట్టించుకోకుండా ఉన్న పళంగా ఆయనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే కేంద్రం మాత్రం ఒక్క రోజులో నిర్ణయం తీసేసుకుంది. నిజానికి అలోక్ వర్మ ఈ నెల 31వ తేదీన రిటైర్ అవ్వాల్సి ఉంది. ఈ లోపు ఆయనేమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటారేమోనన్న ఉద్దేశంతో ఉన్న పళంగా పదవి నుంచి తొలగించడానికి ప్రధానమంత్రి ప్రయత్నం చేసి సఫలం అయ్యారు.