మోడీ పని పడతాడా…మోడీ చెప్పిన పని చేస్తాడా…!

Govt-Appoints-NageshwarRao-

సీబీఐ అనేది పూర్తిగా స్వతంత్రంగా పని చేయాల్సిన, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. రాజకీయాలకు అతీతంగా ప్రజలను అవినీతి నుండీ ఇతరిత్రా నేరాల నుండీ కాపాడాల్సిన సంస్థ. కానీ ఇప్పుడీ సంస్థ మీద వచ్చిన వార్తలు దాదాపు అరవై ఏళ్ళు నిలబెట్టిన్న నమ్మకాన్ని నిట్టనిలువునా కూల్చేశాయి. కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి బానిసగా మారి రాజకీయ ప్రత్యర్థుల వేటకు, మిత్రులైన నేతలపై ఉన్న కేసులను నిర్వీర్యం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతోందన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో అనూహ్యంగా జరుగుతున్న పరిణామాలతో టాప్ టూ అధికారులిద్దర్నీ సెలవులో పంపారు. తాత్కలిక కొత్త సీబీఐ డైరక్టర్‌గా తెలగాణకు చెందిన మన్నెం నాగేశ్వరరావును నియమించారు. అర్థరాత్రి వరకూ ఉన్నతాధికారులతో ప్రధాని సమావేశం జరిపి అలోక్ వర్మ, రాకేష్ అస్థానాల మధ్య వివాదం నేపధ్యంలో ఇద్దర్నీ సెలవులో పంపి ఒడిశా కేడర్‌కు చెందిన నాగేశ్వరరావుని సీబీఐ డైరక్టర్‌గా నియమించారు.

cbi letter
ఆయన 1986 ఐపీఎస్ బ్యాచ్‌ అధికారి. గతంలో ఒడిశా డీజీపీగా కూడా పనిచేశారు. ఈయన స్వస్థలం వరంగల్ జిల్లా మంగపేట మండలం బోరెనర్సాపూర్ గ్రామం. ఏడాదిన్నరగా సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మోడీ ఆదేశాలతో నిన్న అర్ధరాత్రి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మాజీ టీడీపీ నేత విజయరామారావు తర్వాత తెలంగాణ అధికారికి సీబీఐ డైరెక్టర్ అవకాశం వచ్చింది. ఒక రకంగా సీబీఐపైనే సీబీఐ దాడులు చేయడంతో ఆ సంస్థ పరువు పోయింది. ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా వ్యవహరిస్తేనే దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ రాజ్యాంగపరంగా… స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ పేరు నిలబడుతుంది. అలోక్, అస్థానా కేసులు.. ఇప్పుడు మన్నెం నాగేశ్వరరావు ముందు ఉన్న ప్రధాన చాలెంజ్.

cbi
వాళ్లిద్దర్నీ బలవంతంగా మోడీ లీవులో పంపినప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్థానాను ప్రధానమంత్రి మోడీనే ప్రధాని అయ్యాక కోరి మరీ నియమించుకున్నారని అందరికీ తెలుసు. ఇప్పుడు వారి మీదే మన్నెం నాగేశ్వరరావు విచారణ చేయాల్సి ఉంది. దీంతో మోడీ ప్రెజర్ ఖచితంగా ఉండబోతున్న్ ఆ కేసులో ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. నిజానికి సీబీఐ కేసులతో ప్రతిపక్ష పార్టీలకు చెమటలు పట్టించడం కేంద్రం నైజం. కానీ ఇప్పుడు అలోక్ వర్మ, రాకేశ్ అస్థానాల కేసు.. కేంద్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అలోక్ వర్మ, అస్తానాలు ఇద్దరిపై ఉన్న ఆరోపణలు వెలికి తీస్తే లంచాల వ్యవహారమే కాదు.. రాజకీయ కుట్ర కూడా బయటకు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే అందరి దృష్టి ఇప్పుడు మన్నెం నాగేశ్వరరావు మీద పడింది. ఆయన కూడా ఎక్కడా తగ్గడం లేదు సుమీ గత అర్ధరాత్రి 2 గంటల తరువాత సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మన్నె నాగేశ్వరరావు ఆసమయంలోనే కేంద్ర సీబీఐ కార్యాలయంలో తనిఖీలు చేపట్టి ఆ సమయంలో మూడు చాంబర్లను సీజ్ చేయించారు. ఈ తెల్లవారుజాము నుంచి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా, సస్పెన్షన్ కు గురైన దేవేందర్ కార్యాలయాలు ఉన్న 10, 11 అంతస్తుల్లో తనిఖీలు చేపట్టిన నాగేశ్వరరావు బృందం వారి చాంబర్లను సీజ్ చేసింది.

 

Alok-Verma
అంతేకాక సరయిన ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులు ఉన్నావారు తప్ప, మిగతా వారు ఎవరూ సీబీఐ ఆఫీసులోనికి రాకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేయించిన నాగేశ్వరరావు, దగ్గరుండి తనిఖీలను జరిపించారు. బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలో తనిఖీలు చేపట్టిన ఆయన, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. అధికారులు వాడిన ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్లను నాగేశ్వరరావు టీమ్ తమ అధీనంలోకి తీసుకుని, వాటిల్లో ఉన్న సమాచారాన్ని క్రోఢీకరించే పనిలో నిమగ్నమైంది. దీంతో ఇప్పుడు నాగేశ్వరరావు మోడీ పని పడతాడా…మోడీ చెప్పిన పని చేస్తాడా ? అనే టెన్షన్ అందరిలోనూ నెలకొని ఉంది.