ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు తమ ఆందోళనలను మరింత ఉదృత్తం చేశారు. అందులోనే భాగంగా నేడు మంగళగిరిలోని చినకాకాని వద్ద రైతులంతా కలిసి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అయితే అదే సమయంలో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అటువైపు రావడంతో రైతులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
అంతేకాదు ఆయన కారు ముందు బైఠాయించిన రైతులు రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఎమ్మెల్యే కారును ఆపకుండా ముందుకెళ్ళడంతో రెచ్చిపోయిన నిరసనకారులు ఆయన కాన్వాయ్‌పై రాళ్ళ వర్షం కురిపించారు. అడ్డు వచ్చిన సిబ్బందిని కూడా చితకబాదారు. అయితే పోలీసులు వారిని నిలువరించి ఎమ్మెల్యేని అక్కడి నుంచి పంపించేశారు. అయితే నిరసనకారుల ఆగ్రహంతో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పట్ట పగలే చుక్కలు కనిపించాయి.