ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఏడు నెలలుగా ఏదో ఓ వివాదం వెంటాడుతూనే ఉంది. ఇసుక సహా ఈ వివాదాలన్నీ ప్రజలపై నేరుగా ప్రభావం చూపిస్తున్నవే. ఇప్పుడు రాజధాని అంశం కలకలం రేపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా.. బీజేపీ ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను చెబుతున్నప్పటికీ..నేరుగా ఢిల్లీ జోక్యం చేసుకునే పరిస్థితులు రాలేదు. ఇప్పుడు అమరావతి విషయంలో జోక్యం చేసుకోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన నేతలు కూడా.. అమరావతినే రాజధానిగా కొనసాగాలనే అభిప్రాయంతో ఉన్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విషయంలో తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ బీజేపీ నినాదమే కానీ.. అధికార వికేంద్రీకరణ కాదని.. స్పష్టం చేశారు. తన అభిప్రాయాన్ని ఎవరి దగ్గర చెప్పారో వారి దగ్గర చెబుతానని.. అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించి గతంలో.. హడావుడి చేసిన.. విష్ణువర్ధన్ రెడ్డి లాంటి బీజేపీ నేతలు.. అమరావతి రైతులకు మద్దతు ప్రకటించారు. రాజధాని తరలించవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇతర పార్టీల రాయలసీమ నేతలదీ అదే అభిప్రాయం. విశాఖకు రాజధానిని తరలిస్తే.. అది రాయలసీమ వాసులకు ఇబ్బంది అవుతుందని.. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని.. ఎంపీ టీజీ వెంకటేష్ ప్రకటించారు.
రాజధాని విషయంలో.. పూర్తి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని ఏపీ మంత్రులు కూడా.. తేల్చి చెప్పారు. మూడు కాకపోతే ముఫ్పై పెట్టుకుంటాం.. కేంద్రానికేం సంబంధమని.. పద్దతిగానే.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించేశారు. అలా అని కేంద్రం సహకారం లేకుండా.. రాజధానిని మార్చగలరా.. అంటే.. దాదాపుగా అసాద్యమనే చెప్పారు. ఇప్పటికే రాజధానిని కేంద్రం గుర్తించింది. ఇండియా పొలిటికల్ మ్యాప్‌లో కూడా పెట్టింది. అమరావతికి స్వయంగా ప్రధాని మోదీ సంకుస్థాపన చేశారు. రెండు వేల ఐదు వందల కోట్ల ఆర్థిక సాయం కూడా చేసింది.
ఇవన్నీ అధికారిక కారణాలు.. ఇక రాజకీయ కారణాలు కూడా.. రాజధానిని మార్చకుండా.. ఒత్తిడి తేవడానికి బీజేపీకి చాలా ఉన్నాయి. ఏపీ బీజేపీ నేతల ప్రయత్నాలు ఫలించి… అమరావతి విషయంలో కేంద్రం పరోక్షగా అయినా జోక్యం చేసుకుంటుందని… జగన్ ప్రయత్నాలను నిలిపివేస్తుందన్న అభిప్రాయంతో కొంత మంది ఉన్నారు.