బలగం పొట్టి సీతయ్యకి అంబటి సవాల్.

ambati-rambabu-trying-to-challenge-balagam-potti-seethayya

అప్పుడెప్పుడో బి.గోపాల్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద “ప్రతిధ్వని “ సినిమా తీశారు . అందులో పరుచూరి గోపాలకృష్ణ బలగం పొట్టి సీతయ్య అనే రాజకీయ నాయకుడి పాత్ర వేశారు. అధికార పార్టీ ఏమి చేసినా తప్పు పట్టే ఆ పాత్ర డబల్ స్టేట్ మెంట్ కి సంబంధించి ఓ సీన్ వుంది. హరిజనుల మీద ఓ గ్రామంలో దాడి జరుగుతోంది అని తెలియగానే సంబంధిత మంత్రి అక్కడికి హెలికాప్టర్ లో వెళ్లాడా లేక రైల్లో వెళ్లాడా అని అడుగుతాడు బలగం పొట్టి సీతయ్య. ఒకవేళ మంత్రి రైల్లో వెళితే ప్రాణభయంతో అల్లల్లాడుతున్న ప్రజల్ని ఓదార్చడానికి ఇంత ఆలస్యంగా వెళతాడా అని స్టేట్ మెంట్ ఇవ్వండి లేదా హెలికాప్టర్ లో వెళితే ప్రజలు చావుబతుకుల మధ్య ఉంటే ఇంత ప్రజాధనం ఖర్చు పెట్టి గాలిలో వెళతాడా అని స్టేట్ మెంట్ పత్రికలకు పంపమని అనుచరులకు ఆదేశం ఇస్తాడు ఆ బలగం పొట్టి సీతయ్య. ఇప్పుడు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఆయనకు సవాల్ చేసే స్థాయిలో ప్రకటనలు చేస్తున్నాడు.

తిరుమలలో మహాసంప్రోక్షణ సందర్భంగా భక్తులకు దర్శనం ఆపాలని తొలుత టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మీద తీవ్ర విమర్శలు రావడంతో పరిమిత సంఖ్యలో అయినా భక్తులను దర్శనానికి అనుమతించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ముందు టీటీడీ పాలకమండలి నిర్ణయం మీద నిప్పులు చెరిగిన వైసీపీ తాజాగా చంద్రబాబు సూచనతో భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వడం మీద కూడా అదే స్థాయిలో కామెంట్ చేస్తున్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబు చెప్పాడని ఆగమశాస్త్ర నియమాలు మారుస్తారా అని అంబటి ప్రశ్నిస్తున్నారు. ఈ డబల్ స్టేట్ మెంట్ చూస్తే ప్రతిధ్వని బలగం పొట్టి సీతయ్య గుర్తుకు రావడం ఖాయం.

ఇక లోక్ సభలో టీడీపీ అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే విషయంలో కూడా అంబటి ఇలాంటి ప్రకటనే చేశారు. విభజన సమస్యలు ,హామీల మీద కేంద్రం మీద పోరాటం చేయడం లేదని ఇన్నాళ్లు టీడీపీ ని తప్పుబట్టిన ఆయన ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వడం టీడీపీ , బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నారు. ఏదేమైనా అంబటి మాత్రం ఎటు బడితే అటు నాలుక తిప్పేసి బలగం పొట్టి సీతయ్య క్యారెక్టర్ కి గట్టి సవాల్ విసురుతున్నారు.