చెరోదారిలో కన్నా, వీర్రాజు…వాతలు పెట్టిన డొక్కా.

Clashes coming in ap bjp leaders

ఆంధ్రప్రదేశ్ బీజేపీ పీఠం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న సోము వీర్రాజు కి మధ్యలో వచ్చి ఆ సీట్ కొట్టేసిన కన్నా ని చూస్తే మంటెత్తిపోతోంది. అయితే అధిష్టానం హెచ్చరికలతో ఆయన పైకి సంయమనం పాటిస్తున్నట్టు కన్పిస్తున్నారు. కానీ లోలోన ఒరిజినాలిటీ అలాగే వుంది. అందుకే కన్నా వాదనకు భిన్నంగా వాదనలు వినిపిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ప్రస్తుతానికి వున్న ఒకే ఒక్క సారూప్యత చంద్రబాబు మీద వ్యతిరేకత. అయినా ఆ ఇద్దరి ఆలోచనలు భిన్నంగా సాగుతున్నాయి అని చెప్పడానికి తాజాగా ఓ ఉదాహరణ ముందుకు వచ్చింది. ఈ మధ్య కేంద్రం ప్రకటించిన ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ కి జాతీయ స్థాయిలో ప్రధమ స్థానం దక్కిన విషయం తెలిసిందే.

దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఎక్కడ పెరుగుతుందో అన్న భయంతో జీవీఎల్ నరసింహారావు లాంటి బీజేపీ నాయకులు ఇక్కడ అవినీతి అంశాల్ని ప్రస్తావిస్తూ ట్వీట్స్ చేశారు. ఇక ఇదే విషయంలో కన్నా , వీర్రాజు భిన్న వైఖరి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వాణిజ్య విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లోమొదటి స్థానం తెచ్చుకుందని సోము వీర్రాజు ఓ స్టేట్ మెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల పరిస్థితులు బాగా లేవని కేంద్ర హోమ్ మంత్రికి ఫిర్యాదు చేశారు కన్నా. తద్వారా ఆంధ్రాలో బిజినెస్ కి అనుకూల వాతావరణం లేదని చెప్పేందుకు ప్రయత్నం చేశారు.

ఇదే విషయం మీద ఒకప్పుడు కన్నాతో కలిసి ఏపీ క్యాబినెట్ లో పనిచేసిన ప్రస్తుత టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ పాత సహచరుడు మీద విరుచుకుపడ్డారు. కేవలం రాజకీయాల కోసమే రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే దుస్థితికి కన్నా చేరుకున్నారని డొక్కా వాతలు పెట్టారు. కన్నా వైఖరి చూస్తుంటే దొంగే …దొంగ దొంగ అని అరిచినట్టు ఉందని డొక్కా ఆరోపించారు. విభజన సమస్యల మీద నిలదీస్తున్న ప్రజల మీద దాడులు చేస్తున్న బీజేపీ నేతలు , ఢిల్లీ వెళ్లి శాంతిభద్రతలు బాగా లేవని ఫిర్యాదు చేయడాన్ని డొక్కా తప్పు బట్టారు. కన్నా కుట్ర పూరితంగానే ఢిల్లీలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని డొక్కా అన్నారు. ఇప్పటికైనా కన్నా కళ్ళు తెరవకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.