పిల్లలకి మద్యం బాటిళ్ళు పంచిన బీజేపీ ఎమ్మెల్యే…!

Liquor Bottles Found In Lunch Boxes At Temple Event In Up

తమ సభలు, ర్యాలీలకి వచ్చే జనానికి బిర్యానీ పొట్లాలు, మందు సీసాలు అందించడం రాజకీయ నాయకులకి కొత్తేమీ కాదు. కానీ దేవాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆహారంతో పాటు మద్యం బాటిళ్లను స్థానిక బీజేపీ నేత పంపిణీ చేయడంతో యూపీలో కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హర్దోయ్‌ లోని శ్రావణదేవి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ నేత నితిన్‌ అగర్వాల్‌ ఆధ్వర్యంలో శ్రవణ ఆలయంలో ‘పాసి సమ్మేళన్‌’ జరిగింది. ఆయన ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీని వీడి కమలం పంచన చేరారు. పార్టీ మారిన సందర్భంగా తన అభిమానులు, అనుచరులు, పార్టీ నేతలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఈ ప్యాకెట్లు తెరిస్తే అందులో ఆహారంతోపాటు మద్యం బాటిళ్లు కూడా ఉండడంతో కొందరు షాకయ్యారు. ముఖ్యంగా పిల్లలకు పంచిపెట్టిన ప్యాకెట్లలోనూ ఇవి దర్శనమివ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి. పైగా గ్రామంలోని తమ వర్గం వారికి ఈ ప్యాకెట్లను తప్పక పంపిణీ చేయాలని నితిన్‌ చెబుతున్నట్లున్న వీడియో ఒకటి బయటపడడం మరింత వివాదానికి కారణమైంది. ఈ ఘటనపై స్థానిక ఎంపీ తీవ్రంగా స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు బీజేపీ నాయకులు పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసేవారని, ఇలా మద్యం పంపిణీ చేయడం ఏమిటని ? బీజేపీపై దుష్ప్రచారం జరగాలన్న ఉద్దేశంతోనే నితిన్‌ తండ్రి నరేష్‌ అగర్వాల్‌ ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు.