మరో యాత్రకు సిద్దమయిన జగన్…!

YS Jagan Bus Yatra

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ముందుకు వెళుతున్నారు. ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో జగన్ చేపట్టిన పాదయాత్ర రేపు ఇచ్ఛాపురంలో ముగియ‌నుంది. ముగింపు సభలోనే ఎన్నికల శంఖారావం పూరించాలని జగన్ భావిస్తున్నారు. ఈ స‌భ ద్వారానే జ‌గ‌న్ త‌న ఎన్నిక‌ల కార్యాచ‌ర‌ణను ప్రకటిస్తారని టిక్కెట్ల ఖరారు పై ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన జ‌గ‌న్‌.. ద‌శ‌ల వారీగా పార్టీ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. అందులో భాగంగా తొలి లిస్టు ఇచ్ఛాపురం వేదిక‌గా ప్రకటిస్తారని భావిస్తున్నారు. అంతే కాక పాద‌యాత్ర ముగింపు స‌భా వేదిక‌గా సంజీవినిగా భావిస్తున్న ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం చేప‌ట్ట‌నున్న కార్యాచ‌ర‌ణను కూడా వెల్ల‌డించ‌నున్నారు. దీంతో పాటుగా 2019 ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణుల‌కు దిశా నిర్ధేశం చేయ‌నున్నారు. ఎప్పుడూ ఏదో ఒక యాత్ర పేరు చెప్పి జనాల్లో తిరిగే జగన్.. త్వరలో బస్సు యాత్రకి కూడా శ్రీకారం చుట్టనున్నారు.

ఇచ్ఛాపురం వేదిక‌గా పాద‌యాత్ర ముగిసిన వెంట‌నే జ‌గ‌న్ అక్క‌డి నుండి నేరుగా తిరుప‌తి వెళ్లి శ్రీవారిని ద‌ర్శించుకుంటారు. ఆ త‌రువాత కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి జెరూసెలం వెళ్ల‌నున్నారు. ఇక‌ వ‌చ్చిన త‌రువాత వ‌రుస‌గా జిల్లాల స‌మీక్ష‌లు నిర్వ‌హించి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ నుండి జ‌గ‌న్ బ‌స్సు యాత్ర ప్రారంభిస్తారు. దాదాపు ఏపిలోని నియోజ‌క‌వ‌ర్గాలను కవర్ చేసేలా ఈ బ‌స్సు యాత్ర కొన‌సాగ‌నుంది. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా బ‌స్సు యాత్ర పూర్తి చేసి ఆ వెంట‌నే ఇక ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి దిగాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయ్యారు. జ‌గ‌న్ బ‌స్సు యాత్ర ఎక్క‌డి నుండి ప్రారంభించాలి.. ఎక్క‌డ ముగించాల‌నే దాని పై పార్టీ నేత‌లు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.