Election Updates: 15 ఏళ్ల బాలుణ్ని తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా?: పవన్ కల్యాణ్

Election Updates: Burning a 15-year-old boy won't hurt the state?: Pawan Kalyan
Election Updates: Burning a 15-year-old boy won't hurt the state?: Pawan Kalyan

‘అబ్బబ్బా.. సీఎం జగన్ కి గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు. బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అమరనాథ్గౌడ్ తన అక్కను వేధించవద్దని అన్నందుకు వైకాపా కార్యకర్త నిర్దాక్షిణ్యంగా పెట్రోలు పోసి తగలబెడితే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా? చంద్రబాబుపై రాళ్ల వర్షం కురిపిస్తే రాష్ట్రానికి గాయం కాలేదా? రాష్ట్రంలో 30 వేలమంది ఆడబిడ్డలు అదృశ్యమైతే గాయం కాలేదా? కేవలం మీకు రాయి తగిలితేనే రాష్ట్రానికి గాయమైనట్లా?’ అని జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. ‘మీ చుట్టూ భద్రత ఉంది. ఆపై జెండాలున్నాయి.

అంత భద్రత ఉన్న సీఎంపై రాయి వేయడమా? అసలు మీరే దాడులు చేస్తారు.. మీపై దాడులా? రాష్ట్ర డీజీపీ, నిఘా విభాగం ఏం చేస్తున్నట్లు? ఈ వ్యవహారానికి కారకులెవరో ఇప్ప టివరకు గుర్తిం చలేదు. చేతిలో యంత్రాంగం ఉండి కూడా ఎందుకు గుర్తించలేకపోయారు?’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం రాత్రి తెనాలి పట్టణంలో జరిగిన వారాహి విజయభేరీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ‘ఎన్నికలు రాగానే వైఎస్ జగన్కు ఏదోలా గాయమవుతుంది. లేదా ఎవరో ఒకరు చనిపోతారు, చంపేస్తారు. పోయినసారి ఎంతో భద్రత ఉండే విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో గాయం చేశారట. తాజాగా గులకరాయి దాడి. ఆ దాడి గురించి స్పందించాలని మా నాయకులు అడిగారు. కానీ నిజంగా దాడి జరిగిందా? ఆయనే చేసుకున్నారా? లేక కోడికత్తిలా డ్రామానా నాకు తెలియడం లేదు. కరెంటు ఎందుకు తీసేశారో అర్థం కాలేదు. అందుకే స్పందించలేదు’ అని స్పష్టం చేశారు. ‘నాన్నా పులి వచ్చే.. కథలా ఎన్నిసార్లు నమ్మాలి? నమ్మకం పోయింది. ఈ డ్రామాలు ఆపాలి’ అని అన్నారు. ‘అయిదేళ్ల పాటు కోడికత్తి కేసులో శ్రీను అనే యువకుడిని జైల్లో పెట్టారు. మాజీమంత్రి వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపేస్తే గుండెపోటు అని చెప్పారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత, వైఎస్ కుమార్తె షర్మిల న్యాయం చేయాలని కోరితే వారిని కించపరుస్తున్న వ్యక్తి జగన్’ అని మండిపడ్డారు. అందుకే ఇలాంటి దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే కూటమిగా వచ్చామని పేర్కొన్నారు.