చిన్నారులను కాపాడబోయి.. బైక్ ప్రమాదానికి గురైన 108 అంబులెన్స్ పైలెట్ టి.సింహాచలం మృతి చెందాడు. అంబులెన్స్ డ్రైవర్‌గా పలు రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను సురక్షితంగా ఆస్పత్రికి చేర్చిన సింహాచలం అదే రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలను కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళి మండలం రేగులపాడుకు చెందిన సింహాచలం పాడేరులో భార్య,ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన ఆయన 108 అంబులెన్స్ పైలెట్‌గా 12 ఏళ్ల క్రితం చేరాడు.
అప్పటి నుంచి సుమారు నాలగు వేల కేసుల్లో రోగులకు సేవలు అందించాడు. ప్రస్తుతం పాడేరు నియోనాటర్ 108 అంబులెన్స్ పైలెట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 23వ తేదీన ఉద్యోగానికి సెలవు పెట్టి, సొంత గ్రామమైన రేగులపాడుకు బయలుదేరాడు. ఇంటి దగ్గర రెండు రోజులుండి 25న బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు.
బైక్‌కు అడ్డంగా చిన్నారులు రావడంతో వారిని తప్పించడానికి ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి అదే రోజున విశాఖ కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషదఛాయలు అలుముకున్నాయి. సహచరులు శోకసంద్రంలో మునిగిపోయారు.