తృటిలో తప్పిన ప్రమాదం

తృటిలో తప్పిన ప్రమాదం

తమిళనాడులోని కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రి వద్ద శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లు మారుస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మిగతా సిలిండర్లను అ‍క్కడినుంచి తరలించారు. అయితే అప్పటికే అంబులెన్స్‌కు మంటలు అంటుకోవడంతో పూర్తిగా కాలిపోయింది. ఈ సమయంలో అంబులెన్స్‌లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

కాగా ప్రమాదం జరిగే కొన్ని నిమిషాల ముందే అంబులెన్స్‌లో కోవిడ్‌ రోగులను ఆసుపత్రికి తీసుకొచ్చారు. కోవిడ్‌ రోగులను కరోనా వార్డుకు పంపిన వెంటనే సిబ్బంది వచ్చి ఆక్సిజన్‌ సిలిండర్‌ మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సిలిండర్‌ మారుస్తున్న సమయంలో గ్యాస్‌ లీకవడంతో పాటు అంబులెన్స్‌లో షార్ట్‌ సర్య్కూట్‌ చోటుచేసుకోవడంతో ఇది జరిగి ఉండొచ్చని సిబ్బంది వాపోయారు. అయితే ఆసుపత్రి రీజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ మాత్రం ఈ ఘటనపై ఏం స్పందించలేదు. మరోవైపు తమిళనాడులో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గకపోవడంతో ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.