టీ20 ప్రపంచకప్ 2021లో దాయాదుల పోరు కోసం సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. టీమిండియా, పాకిస్తాన్ మధ్య సమరానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో హై వొల్టేజ్ మ్యాచ్‌పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత్‌తో తలపడే జట్టును పాక్ ప్రకటించింది. అయితే ప్రపంచకప్ లో ఇప్పటి వరకు భారత్ పై పాక్ ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. ఈ సారి ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పాక్ భావిస్తుంటే.. మరో సారి దాయాది దేశంపై విజయం సాధించి టోర్నమెంట్లో శుభారంభం చేయాలని భారత్ ఉర్రూతలూగుతుంది.
కాగా.. ఈ మ్యాచ్ నేపథ్యంలో భారత్ పేస్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రాను పాకిస్తాన్ పేసర్ షహీన్ అఫ్రిదితో పోల్చడం అవివేకం అని అమీర్ తెలిపాడు. బుమ్రాకు ఉన్న అనుభవం అఫ్రిదికు ఇంకా లేదని.. షహీన్ ఇంకా చాలా నేర్చుకోవాలని అతడు అభిప్రాయపడ్డాడు. బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ అని కొనియాడాడు. ముఖ్యంగా డెత్ ఓవర్ల విషయానికి వస్తే.. ప్రత్యర్ధి బ్యాటర్లకు చెమటలు పట్టించడం బుమ్రా స్పెషల్ అని అమీర్ వెల్లడించాడు.