Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రపంచానికి అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా మాటల్లో మాత్రం దుందుడుకు పిల్లాడి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. నిన్నటి వరకూ ఉత్తరకొరియాకు సుద్దులు చెప్పమని ప్రపంచ దేశాల అధినేతలకు ఫోన్లు చేసిన ట్రంప్.. ఇప్పుడు తన క్యాబినెట్ ను చక్కదిద్దుకోలేకపోతున్నారు. ఉత్తర కొరియా గువాం ద్వీపంపై దాడిని విరమించుకోవడం, దానికి ట్రంప్ కృతజ్ఞతలు చెప్పడం జరిగిపోయాయి.
కానీ ఉన్నట్లుండి అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మ్యాటిస్.. గువాం ద్వీపంపై ఉత్తరకొరియా దాడి చేస్తే తాము అణుదాడికి దిగుతామని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా అమెరికా అణుదాడి చేస్తే అరగంటలో పది కోట్ల మంది చనిపోతారని, ఉత్తరకొరియాతో పాటు దక్షిణ కొరియా, జపాన్ కు కూడా నష్టమేనని, అందుకే ఓపికగా ఉన్నామని చెప్పుకొచ్చారు.
ఉత్తర కొరియా ఉన్మాది కిమ్ ను జోకొట్టడానికి రెండు నెలలు పట్టింది. ఇప్పుడే ఆయన నిద్రపోయారు. మళ్లీ జేమ్స్ మ్యాటిస్ ఆయన్ను లేపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కిమ్ నిద్రలేస్తే.. అమెరికాకు దీటుగా జవాబు చెప్పి మరిన్ని అణు పరీక్షలు జరపుతారేమోనని దక్షిణ కొరియా ఆందోళన చెందుతోంది. ఎందుకంటే ఉత్తర కొరియాకు ఆనుకుని ఉన్న దేశం అదే కాబట్టి.