అమెరికాలో మరో నల్ల జాతీయుడిపై కాల్పులు… మృతి

అమెరికాలో జాతి వివాదం, ఆరకమైన ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. అసలే ఈ మధ్య  నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతితో తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి నిరసనలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ఈ ఆందోళనలు చల్లారకముందే మరో నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అట్లాంటాలో మరోసారి పెద్ద ఎత్తున నిరసనలు ఆరంభమయ్యాయి. ఈ ఘటనతో ఆ నగర పోలీసు చీఫ్‌ రాజీనామా చేశారు. రెషార్డ్‌ బ్రూక్ ‌ అట్లాంటాలోని ఓ రెస్టారెంటు ముందు రాత్రి సమయంలో కారును నిలిపి అక్కడే  నిద్రపోయాడు. ఈ విషయంపై పోలీసులకు ఆ రెస్టారెంట్‌ యజమాని ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడు మత్తులో ఉన్నట్లు తెలుసుకొని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా అతడు ఘర్షణకు దిగాడు.

అంతేకాకుండా పోలీసు తుపాకీని లాక్కొని పరుగులు తీశాడు. ఇదే సమయంలో కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరపడంతో అతడికి తీవ్ర గాయమైంది. ఆ తర్వాత అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు వివరించారు.