Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ సహా విపక్షాలను పాములు, ముంగిసలు, పిల్లులు, కుక్కలతో పోలుస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో…ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నంచేశారు. బీజేపీ 38వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన అమిత్ షా విపక్షాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వరద వచ్చినప్పుడు మునిగిపోతామన్న భయంతో పాములు, ముంగిసలు, పిల్లులు, కుక్కలు, చిరుతలు, సింహాలు అన్నీ ఏకమై చెట్టుపైకి ఎక్కుతాయని, ఇప్పుడు విపక్షాల తీరు అలానే ఉందని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై పార్టీలన్నీ ఆగ్రహం వ్యక్తంచేయడంతో స్పందించిన అమిత్ షా తాను జంతువుల ఉదాహరణలు చెప్పడానికి కారణాలున్నాయని వ్యాఖ్యానించారు.
పాము-ముంగిస ఉదాహరణ చెప్పడానికి ఒక కారణముందని, ఆ రెండు ప్రాణుల మధ్య ఎప్పుడూ శతృత్వం ఉంటుందని, అవి ఎప్పటికీ కలవవని, అలాగే..సైద్ధాంతికంగా ఎలాంటి సారూప్యతా లేకపోయినా… వేర్వేరు పార్టీలు ఏకతాటిపైకి వచ్చినట్టు చెప్పేందుకు ఆ ఉదాహరణ ఉపయోగించానని అమిత్ షా తెలిపారు. అలా అనడం వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే నేరుగా పార్టీల పేర్లు చెబుతానన్నారు.
ఎస్పీ-బీఎస్పీ, కాంగ్రెస్ – తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ-కాంగ్రెస్…ఇలాంటి పార్టీలు ఎప్పుడూ కలవవని, కానీ మోడీ భయంతో ఇప్పుడు ఏకమయ్యారని అమిత్ షా విమర్శించారు. మొత్తానికి విభజన హామీల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న టీడీపీని చూసి బీజేపీ ఉలిక్కిపడుతోందనడానికి అమిత్ షా వ్యాఖ్యలే ఉదాహరణ. కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలేమీ నెరవేర్చలేదన్న ఆగ్రహంతో టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వస్తే…ముఖ్యమంత్రి డిమాండ్లపై స్పందించాల్సిన బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. టీడీపీ కాంగ్రెస్ కు దగ్గరవుతోందని దుష్ఫ్రచారం చేస్తోంది. వీలుచిక్కినప్పుడల్లా టీడీపీపై అక్కసు ప్రదర్శిస్తోంది.