జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాను అరెస్టు చేశారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శ్రీనగర్ లో మీడియాతో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనను చంపించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
తనను అక్రమంగా నిర్బంధించారని, తన కుమారుడు ఒమర్ అబ్దుల్లాను జైల్లో పెట్టారని, ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదని ఆయన మండిపడ్డారు. జమ్ముకశ్మీర్ కు చెందిన ముఖ్య నేతలందరినీ రహస్య ప్రాంతాల్లో నిర్బంధించారని, ఇది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ధ్వజమెత్తారు.
అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ పునర్విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్తామని చెప్పారు. పార్లమెంట్ లో తన గురించి అమిత్ షా అబద్ధాలు చెప్పారని నిప్పులు చెరిగారు.