ఆమంచి ఏది మంచి అనుకుంటారో ?

Ammachi Decision On Party Change

గత రెండ్రోజులుగా రాజకీయంగా హాట్ టాపిక్ అయిన ఆమంచి కృష్ణమోహన్ చంద్రబాబుతో దాదాపు అరగంటకుపైగా సమావేశమయ్యారు. ఆమంచిని అధినేత దగ్గరకు మంత్రి శిద్ధా రాఘవరావు తీసుకువెళ్లారు. చీరాల నియోజకవర్గంలో పరిస్థితిని వివరించారు. ప్రధానంగా తన అనుచరులకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని చంద్రబాబు దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు భేటీ తర్వాత మాట్లాడిన ఆమంచి రాజకీయ, సామాజికపరమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నానని చెప్పారు. కొందరు వ్యక్తులు వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమాలను రద్దు చేయడం ఏంటని ? చీరాలలో మంత్రి లోకేశ్ పర్యటనను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని దాని గురించి పార్టీ జిల్లా అధిష్టానాన్ని ప్రశ్నిస్తే.. సంతృప్తికరమైన సమాధానాలు రాలేదన్నారు కృష్ణమోహన్. తనకు శత్రువులు ఎవరూ లేరని సమస్యలే తన శత్రువులని చెప్పారు. 10 రోజులుగా వైసీపీ సంప్రదింపులు జరుపుతున్న మాట వాస్తవమేనని కానీ వైఎస్ జగన్‌ను ఎప్పుడూ కలవలేదని చెప్పుకొచ్చారు. పలానా రోజు జగన్‌ను కలుస్తానని ఎక్కడా చెప్పలేదన్నారు.

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో కేవలం రాజకీయ, కులపరమైన చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు కృష్ణమోహన్. అధినేత చంద్రబాబుతో సమస్యలు అన్నింటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. అంతర్గతంగా మాట్లాడుకున్న విషయాలు బయటకు చెప్పలేనని నియోజకవర్గంలో పరిస్థితుల గురించి అధినేతకు వివరించానన్నారు. పార్టీలో ఉంటానా లేదా అన్నది సమస్య కాదని ఒక్కడినే నిర్ణయం తీసుకోలేనన్నారు. ఓ నాయకుడిగా అందరి అభిప్రాయాలను తీసుకొని స్పందిస్తానన్నారు. తాను కాంట్రాక్టులు అడగలేదు. ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదన్నారు. కానీ తాను సిస్టమ్‌లో ఇమడలేకపోతున్నానన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో తాను టీడీపీతో ఘర్షణపడిన విషయాన్ని గుర్తు చేసిన కృష్ణమోహన్ తర్వాత పార్టీలో చేరలేదా అన్నారు. టీడీపీలో ఉండాలనేది తన అభిప్రాయమని అది కూడా అనుచరులతో చర్చించి చెబుతానంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?