ఏకంగా పోలీసులకే ఆమ్యామ్యా…వైసీపీ నేత అడ్డంగా బుక్కయ్యారు

Mylavaram YCP Is In Trouble

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, ఆయా నాయకులు ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభాలకు గురి చేయడం సహజమే అయితే ఏపీలో కొందరు నేతలు ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో ఏకంగా పోలీసులకే డబ్బు ఎర వేసి ప్రలోభాలకు దిగుతున్న ఘటనలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా నిలుస్తోంది.మంత్రి దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో ఆయనను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ ప్రలోభాలకు దిగినట్లు వార్తలు వస్తున్నాయి. మైలవరం వైసీపీ కన్వీనర్‌ వసంత కృష్ణ ప్రసాద్‌ తన అనుచరుడు మాగంటి వెంకట రామారావు ద్వారా జీ.కొండూరు, మైలవరం పోలీస్ స్టేషన్ల ఎస్సైలకి నగదును పంపారని తెలుస్తోంది. తమకు వెంకట రామారావు అనే వ్యక్తి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ మైలవరం, జీకొండూరు ఎస్సైలు శ్రీనివాసరావు, ఎండీ అష్ఫక్‌ నిన్న పై అధికారులకి ఫిర్యాదు చేయడంతో ప్రలోభాలపర్వం వెలుగులోకి వచ్చింది. కృష్ణ ప్రసాద్‌ ప్రధాన అనుచరుడు మాగంటి రామారావు మంగళవారం ఉదయం జి.కొండూరు, మైలవరం పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐలకు ఫోన్‌ చేసి ఎన్నికల్లో కృష్ణ ప్రసాద్‌కు అనుకూలంగా వ్యవహరించాలని కోరారు.

ఇందుకుగాను ఆయన డబ్బులు పంపారని, వాటిని అందించేందుకు కలుస్తానని వారితో చెప్పారు. అయితే డబ్బులు తీసుకునేందుకు ఎస్సైలు తిరస్కరించారు. ఇదే విషయాన్ని స్టేషన్‌ జనరల్‌ డైరీలో నమోదు చేసి, తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అదే రోజు మధ్యాహ్నం రామారావు ఆ పోలీసుస్టేషన్లకు వెళ్లి ఎస్సైల గురించి వాకబు చేయగా, వారు అక్కడ లేరని తెలిసి నేరుగా వారి ఇళ్లకు వెళ్లి డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే కవర్‌ తీసుకునేందుకు వారిద్దరూ నిరాకరించారు. తమకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన రామారావుపై ఉన్నతాధికారుల సూచనల మేరకు బుధవారం మైలవరం, జి.కొండూరు పోలీసుస్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. రామారావు పోలీసుస్టేషన్లకు వెళ్లి వాకబు చేసిన ఉదంతానికి సంబంధించిన ఫోన్‌ డేటా రికార్డులను, సీసీ టీవీ ఫుటేజీలను ఆ ఎస్సైలు సేకరించారు. వాటి ఆధారంగా రామారావుపై కేసు నమోదు చేసినట్టు మైలవరం సీఐ సూరిబాబు తెలిపారు. అయితే అధికార పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే తమ నేతలను ఇరికిస్తోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ విషయం మీద ఈరోజు మైలవరంలో రచ్చ లేపారు ఇరు పార్టీల కార్యకర్తలు.