Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వందలాది మంది హిందువులను రోహింగ్యా మిలిటెంట్లు గతేడాది ఊచకోత కోసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ధ్రువీకరించింది. ఈ మేరకు ఆమ్నెస్టీ బుధవారం ఓ రిపోర్టును విడుదల చేసింది. మయన్మార్లో హిందువులు, రోహింగ్యాలు మధ్య వైరాలను ఆమ్నెస్టీ రిపోర్టు క్లియర్ చేసింది. గతేడాది ఆగష్టు 25న పెద్ద ఎత్తున బౌద్ధులు రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యా ముస్లింలపై విరుచుకుపడ్డారు. అదే రోజున రోహింగ్యా మిలిటెంట్లు సైతం హిందువుల ప్రాంతాలపై విరుచుకుపడి నరమేధం సృష్టించినట్లు ఆమ్నెస్టీ తెలిపింది. ఈ ఘటన వల్లే మయన్మార్ సైన్యం రంగంలోకి దిగిందని, దీంతో 7 లక్షల మంది రోహింగ్యాలు దిక్కతోచని స్థితిలో పొరుగుదేశాలకు వలస బాట పట్టారని వివరించింది.
రోహింగ్యా జాతిని అంతమొందించేందుకు బర్మా సైన్యం వారిపై పౌరుల హత్య, గ్రామాలకు నిప్పుపెట్టడం వంటి ఆరోపణలు చేసిందని ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, రోహింగ్యా మిలిటెంట్లపై సైతం పలు ఆరోపణలు ఉన్నట్లు ఆమ్నెస్టీ పేర్కొంది. హిందువుల కుటుంబాలపై దాడులు జరిపిన రోహింగ్యా మిలిటెంట్లు 53 మందిని ఉరి తీసినట్లు వెల్లడించింది. రఖైన్ రాష్ట్ర ఉత్తరభాగాన ఉన్న ఓ శ్మశానవాటికలో హిందువుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ దారుణానికి ఒడిగట్టింది రోహింగ్యా మిలిటెంట్లేనని ఆమ్నెస్టీ పరిశోధనలో తేలింది. మరో గ్రామంలో కూడా 46 మంది హిందువులు మిస్సయ్యారని వారిని ఏఆర్ఎస్ఏ మిలిటెంట్లే హతమార్చి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.