బాలీవుడ్ జంట అమృత రావు, అన్మోల్ సూద్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కొన్నేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2016లో పెళ్లి చేసుకుంది. బయటకు ఎంతో అన్యోన్యంగా కనిపించినా అందరిలాగే వీరిమధ్య కూడా తగాదాలు వచ్చాయి. పెళ్లికి ముందే ఇద్దరూ ఒకసారి భయంకరంగా గొడవ పెట్టుకున్నారట. దీంతో అమృత సరిగా తిండి కూడా తినకుండా ఏడుస్తూ ఉండిపోయిందట! తాజాగా వారి తొలి గొడవ గురించి కపుల్ ఆఫ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చారు.
‘2012లో మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ అమృత ఇప్పుడేవద్దు, ముందు కెరీర్‌లో స్థిరపడాలని నిర్ణయించుకుంది. కుదరదు, ఇప్పుడు పెళ్లి చేసుకుందామంతే అని మొండిపట్టు పట్టాను, నాకోసం కెరీర్ మీద పెట్టుకున్న ఎన్నో ఆశలను పక్కన పెట్టి వివాహానికి అంగీకరించింది’ అని అన్మోల్ చెప్పుకొచ్చాడు. ‘ఒకరోజైతే ఏకంగా సినిమాలు మానేయాలని అన్మోల్ చెప్పడంతో నేను షాకయ్యాను. నటనకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అతడు చాలా సీరియస్‌గా చెప్పాడు. అంతకుముందు అతడెప్పుడూ అలా మాట్లాడలేదు. ఎంతో బాధపడ్డాను. మా బంధం కోసం నేను ఎంతగానో ప్రేమించే నా సినిమా కెరీర్‌ను వదిలేయాలా? అని శూన్యంలోకి ఆలోచిస్తూ తీవ్ర నిరాశనిస్పృహలోకి వెళ్లిపోయాను’ అని అమృత చెప్పుకొచ్చింది.
ఇక అదే రోజు ఇద్దరూ రెస్టారెంట్‌కు డిన్నర్ డేట్‌కు వెళ్లగా.. అక్కడ దుఃఖం ఆపుకోలేని అమృత వెక్కివెక్కి ఏడ్చింది. ఆమె ఏకధాటిగా ఏడవటం చూసిన అన్మోల్‌కు గుండె పగిలినంత పనైంది. తను ఆమె మనసును ఎంతగా గాయపరుస్తున్నాడో అర్థం చేసుకున్న అన్మోల్.. రెండు రోజుల్లోనే ఆమె దగ్గరకు వెళ్లి సారీ చెప్పడం, తన కోసం కెరీర్ వదులుకోవాల్సిన అవసరం లేదని భరోసా ఇవ్వడం చకచకా జరిగిపోయింది. ఆరోజు అలా ప్రవర్తించినందుకు 12 ఏళ్లుగా తనకు సారీ చెప్తూనే ఉన్నానంటున్నాడు అన్మోల్.