కాబూల్ విమానాశ్రయం సమీపంలో జరిగిన జంట పేలుళ్లకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఖొర్సాన్ (ఐఎస్-కే) ఉగ్రవాదుల ప్రకటించారు. అయితే, వారితో తమకు ఎటువంటి సంబంధాలు లేవని తాలిబన్లు చేసిన ప్రకటనపై అఫ్గనిస్థాన్ మాజీ అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు అఫ్గనిస్థాన్ నుంచి కార్యకలాపాలు సాగించిన ఐఎస్-కేకు తాలిబన్లు, హక్కానీ నెట్‌వర్క్‌లతో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు.
ఐఎస్-కేతో తమకు సంబంధాల్లేవని చేసిన ప్రకటనపై ఆయన మండిపడ్డారు. క్వెట్టా షురా విషయంలోనూ పాకిస్థాన్ ఇలాగే దబాయించిందని ఎద్దేవా చేశారు.‘మా చేతిలో ఉన్న ప్రతి ఆధారం IS-Kతో తాలిబన్లు, హక్కానీ నెట్వర్క్ ప్రత్యేకించి కాబూల్‌లో పనిచేస్తున్న వాటి మూలాలతో సంబంధాలు వెల్లడిస్తున్నాయి.. ISISతో సంబంధాలను తోసిపుచ్చిన తాలిబన్లు.. క్వెట్టా షురా విషయంలో పాకిస్థాన్ మాదిరిగానే దబాయిస్తున్నారు… తాలిబన్లు తమ గురువుల నుంచి బాగా నేర్చుకున్నారు’ అని సలేహ్ ట్విట్టర్లో దుయ్యబట్టారు.
‘పాకిస్థాన్ ఉగ్రవాద కర్మగారాలను, సంస్థలను ఏర్పాటుచేసి అఫ్గనిస్థాన్‌లో విధ్వంసాల కోసం తాలిబన్లకు బాంబులు, పేలుడు పదార్థాలను సరఫరా చేస్తోంది.. క్వెట్టా షురాగా పిలిచే పాక్ సైన్యం ప్రణాళికలు అమలు చేయడానికి తప్ప మరొకటి కాదు’అని అంతకు ముందు సలేహ్ మండిపడ్డారు. కాబూల్ విమానాశ్రయంపై దాడులకు తామే బాధ్యులమని ప్రకటించిన ఐఎస్.. అఫ్గన్ మీడియాకు ఫిదాయి ఫోటోను కూడా విడుదల చేసింది.
కాబూల్ విమానాశ్రయం వద్ద పేలుళ్లలో కనీసం 30 నుంచి 60 మంది వరకూ చనిపోయారని, మరో 120 నుంచి 140 మంది గాయపడ్డారని అఫ్గన్ ఆరోగ్య విభాగం అధికారులు తెలిపారు. అయితే, తాలిబన్లు మాత్రం కనీసం 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, 60 మంది గాయపడ్డారని ప్రకటించారు. తొలి పేలుడు విమానాశ్రయంలోని అబే గేటు వద్ద, రెండోది బరోన్ హోటల్ వద్ద సంభవించింది.