యాంకర్ రష్మీ సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మూగ జీవాలకు హానీ కలిగిన, ఎవరైనా గాయపరిచిన వారిపై ఆమె అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే ఆమె జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనపై రష్మీ తనదైన శైలిలో స్పందించింది. ఇటీవల తిరువనంతపురం బీచ్ సమీపంలో బ్రూనో అనే కుక్కపై ముగ్గురు వ్యక్తులు అతి దారుణంగా దాడి చేసి, చంపిన ఘటన ఇటీవల వెలుగు చూసింది.
ఆ కుక్కను కర్రలతో బాది, ఆపై చేపల గాలానికి వేలాడాదీసినట్లుగా వేలాడదీసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో జస్టిస్ ఫర్ బ్రూనో అనే పేరుతో హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖలు స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ సైతం ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా రష్మీ కూడా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేస్తూ.. ‘ఇలాంటి ఘటనలు వింటే మనుషులు, మానవత్వం అనే వాటిపైనే సిగ్గేస్తోంది.
ఇలాంటివి చూసినప్పుడు కరోనా లాంటి మహమ్మారి ఇంకా రావడం సమంజసమే అనిపిస్తుంది. బ్రూనో ఏం పాపం చేసింది. మీకేం అన్యాయం చేసింది. అంత దారుణంగా చంపేశారు’ అంటూ రష్మీ తీవ్రంగా మండిపడింది. కాగా బ్రూనో అనే లాబోడర్ కుక్కను కర్రలతో బాది, ఆపై చేపల గాలానికి వేలాడాదీసినట్లుగా వేలాడదీసి హత్య చేశారు. ఈ ఘటనకు పాల్పడిన సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. ఆ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.