ఏపీలో ఆసక్తికర రాజకీయాలు… ఒకే కుటుంబంలోని భార్యాభర్తలు వేర్వేరు పార్టీలు

andhra pradesh political leaders Family Politics

ఆంద్ర రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారనుంది తమ్ముడు టీడీపీ, అన్న కాంగ్రెస్. భార్య టీడీపీ, భర్త జనసేన. భర్త బీజేపీ ఎమ్మెల్యే, భార్య జనసేన నేత ఇలా ఉన్నాయి ఏపీలో కొన్ని రాజకీయ కుటుంబాల పరిస్థితి. కొద్ది రోజుల క్రితం రాజ‌మండ్రి అర్బ‌న్ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ భార్య ల‌క్ష్మీ ప‌ద్మావ‌తి జ‌న‌సేన దీక్ష‌లో కూర్చొవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే తాను ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానిని అని ఆయ‌న ఒక తీవ్ర స‌మ‌స్య‌పై పోరాడుతుంటే చూసి దీక్ష‌లో కూర్చున్నాన‌ని పద్మావ‌తి చెప్పుకొచ్చారు. నిన్న తాజాగా బర్రె జయరాజు అనే జనసేన నాయకుడు మాట్లాడుతూ నేను జనసేనలో ఉన్నాను, నా భార్య వెంకట రమణ కాళ్ళ జడ్పీటీసీగా టీడీపీ తరపున గెలిచారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్‌కు చెప్పాను. ఇద్దరు వేర్వేరు పార్టీలో కొనసాగుతున్నాం విమర్శలు వచ్చే అవకాశం ఉంది. మీరు కోరితే ఆమెతో పార్టీకి రాజీనామా చేయిస్తానని జనసేన అధినేత పవన్‌కు చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

ఇప్పుడు ఇదే కోవలో మాజీ ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం కూడా నడవనుంది.  కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన అధిష్టానంతో పోరాడినా ఫలితం లేకపోయింది. విభజన జరిగిపోయింది. 2014 ఫిబ్రవరి 19న సీఎం పదవికి రాజీనామా చేశారు. అదే ఏడాది మార్చి 12న జై సమైక్యాంధ్ర పార్టీని ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో తన పార్టీ తరపున అభ్యర్థులను నిలిపిన ఆయన… తాను బరిలో నిలబడలేదు. ఆ తర్వాత గడచిన నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే రాజకీయ భవిష్యత్ కోసం ఏడు నెలల క్రితం తన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయన చేరికలో కిరణ్ పాత్ర కూడా ఉందన్నది అందరికీ తెలిసిందే. బెంగుళూరులో తెలుగుదేశం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలోనూ కిరణ్ పాల్గొన్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కిషోర్ కుమార్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కిరణ‌ కుమార్ రెడ్డిని విపరీతంగా పొగిడేశారు. దీంతో కిరణ్ కూడా టీడీపీలోకి వస్తారేమోనన్న అనుమానం కలిగింది. కాని  అనూహ్యంగా కాంగ్రెస్ హైకమాండ్ ఆపరేషన్ స్వగృహకు తెరలేపడంతో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. నిన్న రాత్రే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవనున్నారు. నేడు తిరిగి కాంగ్రెస్ కండువాను కప్పుకోనున్నారు.