కిరణ్ ప్లీజ్ రా రా అంటున్న పార్టీ.

Pallam Raju Meets Kiran kumar reddy,Be Back in Congress

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని తిరిగి బతికించుకోడానికి 10 జన్ పథ్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇక్కడ పూర్వ వైభవం రావాలంటే పార్టీకి దూరం అయిన ఘనాపాఠీలు అందర్నీ తిరిగి కాంగ్రెస్ ఛత్రం కిందకు తీసుకురావడానికి రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర విభజన సమయంలో 10 జన్ పథ్ ని ఢీకొట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని కూడా తిరిగి దగ్గర చేసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పట్లో యూపీఏ సర్కార్ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా ఢిల్లీలో ధర్నా చేశారు. ఆ విధంగా కాంగ్రెస్ తో వున్న సుదీర్ఘ బంధాన్ని కాదనుకుని కొత్త పార్టీ పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి కిరణ్ కుమార్ రెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా వున్నారు. ఈ నాలుగేళ్లలో ఆయన ఏదో ఒక పార్టీలోకి చేరొచ్చని ఊహాగానాలు వచ్చినా అవేమీ నిజం కాలేదు. ఇక కిరణ్ తమ్ముడు కిషోర్ కూడా టీడీపీ లో చేరిపోవడంతో ఇక ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు అంతంత మాత్రమే అన్న టాక్ వచ్చింది.
కిషోర్ తో పాటు కిరణ్ కూడా టీడీపీ లోకి వచ్చి రాజంపేట నుంచి ఎంపీ గా పోటీ చేస్తారని కూడా కొన్నాళ్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఇక ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి అనగా ఊహించని పరిణామం ఎదురైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కి సన్నిహితుడుగా పేరుపడ్డ మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది . అందుకు కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని వివరణలు కోరినట్టు సమాచారం. ఈ విషయాన్ని పల్లం రాజు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఒకప్పుడు కాదు కూడదు అనుకున్న కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ బతిమాలుకోవాల్సివచ్చింది. అదే రాజకీయాల్లో చిత్రం …భళారే విచిత్రం.