మహారాష్ట్ర రాజకీయం ఇప్పట్లో తేలేలా కనిపించడంలేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పోతున్నారే తప్ప ఎవరు కూడా ముందుకు వచ్చి చర్చలు జరిపి సమస్య ని పరిష్కారించుకునేలా కనిపించడంలేదు. పాపం ఏదో చేస్తారు అని ఉహించి ఓట్లు వేసిన ఓటర్లకు కూడా విసిగుతెప్పిస్తున్నారు శివసేన – బీజేపీ నేతలు. ముగ్గురు ఉన్న సమయంలో ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికి లాభం అన్నట్టు సీఎం కుర్చీకోసం బీజేపీ – శివసేన పోరాటం చేస్తుంటే మహారాష్ట్ర ప్రజలు మాత్రం బాలీవుడ్ హీరోని సీఎం చేయాలంటూ సోషల్ మీడియా లో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అదేంటి ఇప్పటికే బీజేపీ – శివసేన ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొట్టుకుంటుంటే మధ్య లో ఈ బాలీవుడ్ హీరో ఎవరు అని అనుకుంటున్నారా అయన మరెవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్.
తాజాగా మహరాష్ట్ర లో జరిగిన ఎన్నికలలో బీజేపీ – శివసేన కూటమి మెజారిటీ స్థానాలని గెలుచుకుంది. కానీ శివసేన 50-50 ఫార్ములాని తెరపైకి తీసుకురావడంతో ప్రభుత్వ ఏర్పాటు లో జాప్యం జరుగుతుంది. రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ శివసేన పట్టుబడుతోంది. కాని శివసేన డిమాండ్‌ను బిజెపి ఒప్పుకోవడం లేదు. సీఎం స్థానం తమదేనని బిజెపి స్పష్టం చేసింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర కి చెందిన కొందరు బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ సిఎంగా చేయాలంటూ ట్విట్టర్ లో పోస్ట్ లు చేస్తున్నారు.
అసలు సీఎంగా అనిల్ కపూర్ నే ఎందుకు ఉండమన్నారు అంటే 2001లో విడుదలైన నాయక్ అనే సినిమాలో అనిల్ కపూర్ ఒకరోజు సిఎంగా నటించారు. అదే తరహాలో ఇప్పుడు సిఎంగా ఆయనను ఉండమంటున్నారు. మహారాష్ట్ర సిఎం ఎవరనేది తేలేవరకు సిఎంగా అనిల్ కపూర్ ఉండాలని ఈ విషయంపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ – ఆదిత్య ఠాక్రే ఒకసారి ఆలోచించాలని నెటిజన్లు కోరుతున్నారు. దీనిపై స్పందించిన అనిల్ కపూర్ తాను మంచి నటుడిని మాత్రమే.. నిజమైన రాజకీయాలలో నాకు అనుభవం లేదు అంటూ తెలిపాడు