హార్దిక్ పాండ్య‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు

Anil Kapoor Tweet to Hardik Pandya

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హార్దిక్ పాండ్య… భార‌త క్రికెట్ తాజా సంచ‌ల‌నం. ప్ర‌ధానంగా బౌల‌ర్ అయిన పాండ్య బ్యాటింగ్ లోనూ రాణిస్తూ… ఆల్ రౌండ‌ర్ గా ఎదుగుతున్నాడు. ఆస్ట్రేలియాతో చెన్నైలో జ‌రిగిన తొలి వ‌న్డేలో 66 బంతుల్లో 83 ప‌రుగులు చేసిన త‌రువాత‌… పాండ్యాను అంద‌రూ మాజీ ఆల్ రౌండ‌ర్ క‌పిల్ దేవ్ తో పోలిస్తున్నారు. ఈ మ్యాచ్ తో పాండ్య పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగుతోంది. సాధార‌ణ క్రికెట్ ప్రేక్ష‌కులే కాక‌… మాజీ క్రికెట‌ర్లు, సినీ సెల‌బ్రిటీలు హార్దిక్ పాండ్య‌ను ప్ర‌శంస‌ల వ‌ర్షంలో ముంచెత్తుతున్నారు. తాజాగా బాలీవుడ్ న‌టుడు అనీల్ క‌పూర్ చెన్నై మ్యాచ్ గురించి ప్ర‌స్తావిస్తూ పాండ్య‌, ధోనీని అభినందించాడు.

మ్యాచ్ లో భార‌త్ అనూహ్యంగా పుంజుకుని విజ‌యం సాధించింద‌ని, పాండ్య‌, ధోనీ నిజ‌మైన ఛాంపియ‌న్ల‌ని అనిల్ క‌పూర్ ట్విట్ట‌ర్ లో ప్ర‌శంసించాడు. దీనిపై పాండ్య వెంట‌నే రియాక్ట్ అయ్యాడు. అనిల్ క‌పూర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపిన పాండ్య నేను మీ వీరాభిమానిని అని చెప్పాడు. దీనిపై అనిల్ క‌పూర్ కూడా వెంట‌నే కామెంట్ పెట్టారు. చెన్నైలో ఇన్నింగ్స్ చూసిన త‌రువాత దేశ‌మంతా నీ అభిమానులుగా మారిపోయారని, నిన్ను చూస్తే చాలా గ‌ర్వంగా ఉంద‌ని ట్వీట్ చేశారు. అనిల్ క‌పూర్ చెప్పిన‌ట్టుగా నిజంగానే చెన్నై మ్యాచ్ త‌ర్వాత హార్దిక్ పాండ్య కు పెద్ద సంఖ్య‌లో అభిమానులు ఏర్ప‌డ్డారు. పాండ్యపై ఒక్క‌సారిగా అంచ‌నాలు పెరిగిపోయాయి. పాండ్య ఇలాగే నిల‌క‌డ‌గా రాణించి క‌పిల్ దేవ్ స్థాయికి చేరుకోవాల‌ని అంద‌రూ ఆకాంక్షిస్తున్నారు.