కొందరు దర్శకులు, రచయితలకు కొందరు హీరోయిన్లపై ప్రత్యేక అభిమానం ఉంటుంది. వాళ్లను తరచుగా తమ సినిమాల్లో పెట్టుకోవడం.. వాళ్ల ప్రత్యేకత ఉండేలా చూసుకోవడం.. సాధ్యమైనంత ఎక్కువ రన్ టైం ఇవ్వడానికి చూడటం చేస్తుంటారు. ఒకప్పుడు సీనియర్ నటి శారద మీద పరుచూరి సోదరులు ఇలాంటి అభిమానమే చూపేవాళ్లు. వాళ్లు రచయితలుగా పని చేసిన చాలా సినిమాల్లో శారద ప్రత్యేక పాత్రల్లో మెరిశారు.
ఐతే అప్పట్లో కాంబినేషన్లు రిపీట్ చేయడం మామూలు విషయమే కానీ.. ఈ రోజుల్లో ఆ పరిస్థితులు లేవు. ఒక కాంబినేషన్లు రెండు మూడు సినిమాలొస్తేనే ఎక్కువ అన్నట్లుంది పరిస్థితి. ఇలాంటి టైంలోనూ హీరోయిన్ అంజలి మీద ఆమె గాడ్ ఫాదర్ అనదగ్గ కోన వెంకట్ చూపించే అభిమానం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. కొన్నేళ్ల కిందట అంజలి తమిళంలో ఓ వివాదం కారణంగా సినిమాలు కోల్పోయిన సమయంలో తెలుగులో ‘బలుపు’ సినిమాలో కీలక పాత్ర దక్కింది. ఆ చిత్రానికి రచయిత కోన వెంకటే అన్న సంగతి తెలిసిందే.
ఆ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం మరిన్ని సినిమాల్లో కొనసాగింది. ఆమెను కథానాయికగా పెట్టి ‘గీతాంజలి’ సినిమా తీయించారు. ఆ చిత్రానికి రచయిత, నిర్మాతగానే కాక అన్నీ తానై వ్యవహరించాడు కోన. ఆ తర్వాత కోన దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసిన ‘శంకరాభరణం’లోనూ ఆమె కీలక పాత్ర చేసింది. ఇప్పుడు కోన వెంకట్ నిర్మాణంలో, రచనలో కీలకంగా వ్యవహరించిన ‘నిశ్శబ్దం’లోనూ అంజలిది ముఖ్య పాత్ర.
అందరూ ఇది అనుష్క సినిమా అనుకున్నారు కానీ.. ఆమెను మించి స్క్రీన్ టైం అంజలినే తీసుకోవడం విశేషం. ప్రథమార్ధంలో అయితే అంజలి తప్ప అనుష్క కనిపించదు. ఇది అనుష్క సినిమా అనే విషయాన్ని మరిచిపోయే స్థాయిలో ఆమె స్క్రీన్ టైం ఉంటుంది. ద్వితీయార్ధంలో అనుష్క ఫ్లాష్ బ్యాక్ రావడం అంజలి కనిపించదు కానీ.. మిగతా అంతటా ఆమెదే ఆధిపత్యం. కోనకు అంజలి మీద ఎంత ప్రత్యేక అభిమానం ఉన్నా సరే.. అనుష్కనే పక్కకు నెట్టేసి ఆమెకు అంత స్క్రీన్ టైం ఇప్పించడం ఆశ్చర్యం కలిగించే విషయం. అలాగని ఆమె పాత్ర అంత ప్రత్యేకంగా ఉందా అంటే అదీ లేదాయె