2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో దోషిగా తేలి జీవితకాలం నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్ అంకిత్ చవాన్‌కు ఊరట కలిగింది. ఈ ముంబై మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ పై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. బీసీసీఐ బ్యాన్ ఎత్తివేయడంతో ఇకపై ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేందుకు అంకిత్ చవాన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది.
స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడడంపై తాను పశ్చాత్తాపం చెందుతున్నానని.. అంకిత్ చవాన్ ముంబై క్రికెట్ అసోసియేషన్‌ను కోరగా.. వారి సలహా మేరకు బీసీసీఐకి తనకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ మే నెలలో ఒక లేఖను రాశాడు. తాజాగా బీసీసీఐ అంకిత్ చవాన్‌పై నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా అంకిత్ చవాన్ తన కెరీర్‌లో 7 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 15 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
కాగా 2013 ఐపీఎల్ సీజన్‌లో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలు బూకీలతో సంప్రదింపులు జరిపి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు నిజమని తేలడంతో బీసీసీఐ వారిని జీవితకాలం క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది.
కాగా తాను నిర్దోషినంటూ శ్రీశాంత్ గతేడాది సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ 2019లో నిర్ణయం తీసుకున్నాడు. దాంతో గతేడా ఏడాది సెప్టెంబర్‌తో శ్రీశాంత్ శిక్షాకాలం పూర్తయింది. అనంతరం కేరళ తరపున శ్రీశాంత్ ముస్తాక్ అలీ ట్రోపీలో పాల్గొన్నాడు.