బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి నేటికి ఏడాది. ఈ సందర్భంగా అతడి మాజీ ప్రేయసి, నటి అంకిత లోఖండే పదేళ్ల క్రితం సుశాంత్‌తో కలిసి దీపావళి వేడుకల్లో డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఇది 2011 దీపావళి నాటి వీడియో. నీ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి సుశాంత్.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అని రాసుకొచ్చింది. ఇందులో బ్లాక్ డ్రెస్ ధరించిన సుశాంత్ చిరునవ్వులు చిందిస్తూ అంకితతో స్టెప్పులేశాడు.
ఆయన చిరుదరహాసాన్ని చూస్తుంటే అభిమానుల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.కాగా సుశాంత్ గతేడాది జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఎంతో భవిష్యత్తున్న టాలెంటెడ్ నటుడు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడమేంటని అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇది ఆత్మహత్య కాదని, బాలీవుడ్ మాఫియా చేయించిన హత్య అని ఆరోపించారు.
సుశాంత్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో సీబీఐ విచారణ కూడా జరుపుతోంది. సుశాంత్ ఈ లోకాన్ని విడిచి పెట్టి సంవత్సరం పూర్తైనా అభిమానుల గుండెల్లో మాత్రం ఇప్పటికీ కొలువై ఉన్నాడు.ఇదిలా వుంటే పవిత్ర రిష్తా సీరియల్ షూటింగ్ సమయంలో అంకిత, సుశాంత్ సింగ్‌ల మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఆరేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. ఆ తర్వాత సుశాంత్, రియా చక్రవర్తిని లవ్ చేసిన సంగతి తెలిసిందే.