నిజం గెలుస్తుందని చెప్పిన అంకిత

నిజం గెలుస్తుందని చెప్పిన అంకిత

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సుశాంత్‌​ తండ్రి కేకే సింగ్‌.. రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యుల మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీనిపై సుశాంత్‌​ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే స్పందించారు. రియాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిసిన కాసేటికే అంకిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ట్రూత్‌ విన్స్‌’ అనే ఇమేజ్‌ని పోస్ట్‌ చేశారు.

ఇది చూసిన నెటిజనులు రియా మీద వస్తోన్న ఆరోపణల గురించి అంకితకు తెలుసని.. అందుకే ఆమె ఇలా స్పందిచారని భావిస్తున్నారు. సుశాంత్‌ మరణించిన నాటి నుంచి అంకిత తన ఆలోచనలను వ్యక్తికరించడానికి మాటల బదులు సింబల్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ‘దిల్‌ బేచారా’ విడుదల సమయంలో అంకిత పవిత్ర ‘రిష్తా టూ దిల్‌ బేచారా వన్‌ లాస్ట్‌ టైమ్‌’ అంటూ పోస్ట్‌ చేశారు. సుశాంత్‌ పవిత్ర రిష్తా సిరీయల్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘దిల్‌ బేచారా’ అతడి ఆఖరి చిత్రం.

2009లో వచ్చిన ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌లో అంకిత, సుశాంత్‌ కలిసి నటించారు. దాదాపు ఆరేళ్లు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. సినిమాల్లో అవకాశం వచ్చిన తర్వాత సుశాంత్‌, అంకితకు దూరమయ్యాడని సమాచారం. ఆ తర్వాత అంకిత కూడా సినిమాల్లో నటించారు. మణికర్ణిక సినిమాలో అంకిత కీలక పాత్ర పోషించారు.

ఆ తర్వాత ఆమె బిలాస్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త విక్కి జైన్‌ను ప్రేమిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా రియా చక్రవర్తిపై సుశాంత్‌ తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె సుశాంత్‌ను ఆర్థికంగా మోసం చేసిందని.. మానసికంగా హింసించిందని తెలిపాడు. రియా వల్లనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. ఈ మేరకు రియాపై బిహార్‌లో కేసు నమోదు చేశారు.