గతేడాది డిసెంబర్ 4న ‘పుష్ప-2: ది రూల్’ ప్రీమియర్ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కి మరో ఊరట లభించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి వ్యక్తిగతంగా హాజరు కావాలనే షరతు నుంచి బన్నీకి నాంపల్లి కోర్టు మినహాయింపు కల్పించింది.
కాగా, ఐకాన్ స్టార్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 3న న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పీఎస్‌లో హాజరు, రూ. 50వేల రెండు పూచీకత్తులతో పాటు సాక్షులని ప్రభావితం చేయరాదనే షరతులతో బెయిల్ మంజూరు చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు గత ఆదివారం బన్నీ స్వయంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సంతకం చేశారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా తనకు ఈ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టును విన్నవించారు. దాంతో అల్లు అర్జున్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన నాంపల్లి కోర్టు ఆయనకి ఈ షరతు నుంచి మినహాయింపు ఇచ్చింది.