ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా రోజు రోజుకీ తీవ్రరూపం దాల్చుతుంది. దేశమంతా లాక్ డౌన్ గుప్పెట్లో నడుస్తోంది. తాజాగా ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ నుంచి పలు రాష్ట్రాలకు వెళ్లిన వారి నుంచి కరోనా తీవ్రంగా వ్యాపిస్తుంది. వారినందరివీ ఏరి మరీ క్వారైంటైన్ కు తరలించే కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. అయితే ఈ ఉదంతం మరువకముందే మధ్య ప్రదేశ్‌లో మరో ఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తుంది. దుబాయ్ నుంచి వచ్చి ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
అయితే దుబాయ్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న సురేశ్ అనే వ్యక్తి తల్లి గత నెలలో మరణించారు. దీంతో గత నెల 17వ తేదీన అతను సొంతూరు అయన మొరేనాకు చేరుకొని 20న దశదిన కర్మ నిర్వహించి బంధువులు, కాలనీవాసులకు భోజనాలు పెట్టించాడు. దాదాపు 1500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే.. మార్చి 25న సురేశ్ జ్వరం బారినపడ్డాడు. ఓ నాలుగు రోజుల తర్వాత ఆస్పత్రికి వెళ్లడంతో అతనికి.. అతని భార్యకు కరోనా సోకినట్టు ఏప్రిల్ 2న నిర్ధారణ అయింది.
అయితే ఆ దంపతులతో దగ్గరగా ఉన్న 23 మందికి పరీక్షలు జరపగా వారిలో 10 మందికి పాజిటివ్ వచ్చింది. దాంతో మొత్తం 12 మందిని ఆస్పత్రి క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని మెరెనా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్సీ బండిల్ వెల్లడించారు. అంతేకాకుండా నెగిటివ్ ఫలితాలు వచ్చినవారిని ఇళ్ల వద్దే గృహ నిర్భంధంలో ఉంచామని స్పష్టం చేశారు. అలాగే… దుబాయ్ నుంచి బయల్దేరేముందే అతనికి వైరస్ సోకిందని.. కానీ లక్షణాలు బయటపలేదని డాక్టర్ వెల్లడించారు. ఇక సురేశ్ భోజనాలు ఏర్పాటు చేసిన కాలనీ మొత్తాన్ని స్థానిక యంత్రాంగం సీజ్ చేసింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేసి కాలనీ మొత్తాన్ని క్వారైంటైన్ లో పెట్టేసింది.